భారతదేశంలో సామాన్య ప్రజలకు త్వరలోనే కరెంట్ బిల్లుల భారం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (CERC) విద్యుత్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజీలు వసూలు చేసే చార్జెస్ సమీక్షిస్తోంది.
ప్రస్తుతం మన దేశంలో వేర్వేరు విద్యుత్ ఎక్స్ఛేంజీలలో కరెంట్ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. కానీ జనవరి 2026 నుండి అమల్లోకి రానున్న 'మార్కెట్ కప్లింగ్' విధానం ద్వారా అన్ని ఎక్స్ఛేంజీలలో బిడ్లను కలిపి ఒకే ధరను నిర్ణయిస్తారు. దీనివల్ల కరెంట్ ధరలు ఒకే విధంగా ఉండటమే కాకుండా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
కరెంట్ ట్రేడింగ్ సమయంలో వసూలు చేసే చార్జెస్ (Transaction Fees) కూడా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం యూనిట్‌కు 2 పైసలుగా ఉన్న ఈ ఫీజును 1.5 పైసలకు లేదా 1.25 పైసలకు తగ్గించేలా సమీక్ష జరుగుతోంది. దీని ద్వారా కోట్ల యూనిట్ల వ్యాపారం జరిగేటప్పుడు భారీ మొత్తంలో ఆదా అవుతుంది.
దీని వల్ల విద్యుత్ వినియోగదారులకు కలిగే ప్రయోజనం ఏంటంటే విద్యుత్ పంపిణీ సంస్థలు (Discoms) తక్కువ ధరకే విద్యుత్తును కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. కంపెనీలకు ఖర్చు తగ్గితే ఆ ప్రయోజనం నేరుగా సామాన్య వినియోగదారులకు చేరుతుంది. అంటే మీ ప్రతినెల కరెంట్ బిల్లు తగ్గుతుంది. ఇంకా ధరలు అందరికీ అందుబాటులో ఉండటం వల్ల విద్యుత్ సప్లయ్ లో నాణ్యత పెరుగుతుంది.
►ALSO READ | త్వరలో ఒక్క సిగరెట్ ధర 72 రూపాయలు ? స్మోకింగ్ మానేద్దాంరా బాబు అనుకునే రోజు వస్తుందా !
గత పదేళ్లలో భారతదేశంలో విద్యుత్ వ్యాపారం 16 రెట్లు పెరిగింది. 2023-24 నాటికి 120 బిలియన్ యూనిట్లను దాటింది. ఇంత పెద్ద మార్కెట్‌లో పారదర్శకత తీసుకురావడం వల్ల భారీ పరిశ్రమలకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ 'వన్ నేషన్ - వన్ ప్రైస్' లాంటి సంస్కరణలు కరెంట్ కష్టాలను తగ్గించడమే కాకుండా ప్రజల జేబుపై భారాన్ని కూడా తగ్గిస్తాయి.
