హైదరాబాద్ సిటీ, వెలుగు: గ్రేటర్లో జనవరి నుంచి మార్చి వరకు దశల వారీగా 300 కొత్త బస్సులను ప్రవేశ పెడతామని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. ఇటీవల ఆర్టీసీ ఒక సర్వే నిర్వహించింది. అందులో మహాలక్ష్మి స్కీమ్ అమలు తర్వాత ఆక్యుపెన్సీ రేషియో105 శాతం పెరిగినట్టు తేలింది.
అలాగే, అదనపు బస్సుల అవసరం ఉందని గుర్తించింది. ఇప్పటికే 25 బస్‌డిపోల ద్వారా రోజుకు 3,200 బస్సులను నడుపుతున్న ఆర్టీసీ 5.5 లక్షల మందిని తమ గమ్యస్థానాలకు చేరుస్తోంది. ఇప్పుడు నడుపుతున్న బస్సుల్లో 550 ఎలక్ట్రిక్ బస్సులు, మరో 275 మెట్రో డీలక్స్ బస్సులున్నాయి.
తాజాగా రాణిగంజ్డిపో పరిధిలో 65 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే జనవరి నుంచి 150 మెట్రో డీలక్స్ బస్సులు, మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో 150 మెట్రో ఎక్స్ప్రెస్బస్సులను ప్రవేశ పెడుతున్నట్టు అధికారులు తెలిపారు. ‘హైదరాబాద్ కనెక్ట్’ పేరుతో ప్రత్యేకంగా కొత్త కాలనీలతో పాటు ఇప్పటి వరకూ బస్సు సౌకర్యం లేని ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బస్సులను నడిపేందుకు ప్రణాళిక రూపొందించింది.
