ముంబై: మున్సిపల్ ఎన్నికల వేళ మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజకీయంగా విడిపోయిన పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటైంది. మామఅల్లుళ్లు శరద్ పవార్, అజిత్ పవార్ చేతులు కలిపారు. ఈ మేరకు పింప్రి-చించ్‌వాడ్ మునిసిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. పవార్ కుటుంబ సభ్యుల కలయిక స్టేట్ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సందర్భంగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్పీ) పింప్రి-చించ్‌వాడ్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నాయని ప్రకటించారు. పింప్రి-చించ్‌వాడ్ మునిసిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు తమ కుటుంబం కలిసి వచ్చిందని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. స్థానిక నాయకులతో సీట్ల షేరింగ్ గురించి చర్చించామని.. త్వరలో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
మాజీ సీఎం శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ఎన్సీపీని రెండు ముక్కలుగా చీల్చిన విషయం తెలిసిందే. గత ఏడాది జులైలో ఎన్సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలతో అధికార మహాయుతి కూటమిలో చేరారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. మెజార్టీ ఎమ్మెల్యేలు అజిత్ వెంటే ఉండటంతో ఎన్సీపీ, పార్టీ గుర్తు అధికారికంగా అతడికే దక్కింది.
దీంతో శరద్ పవార్ వర్గానికి ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరత్చంద్ర పవార్’ అని పేరు, బూరుగ ఊదుతున్న వ్యక్తి గుర్తును ఈసీ కేటాయించింది. ఇదిలా ఉంటే.. తనకు వెన్నుపోటు పొడిచి పార్టీని రెండు ముక్కలుగా చీల్చిన అల్లుడు అజిత్ పవార్‌తో శరద్ పవార్ చేతులు కలపడం మహా పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనతో రాజకీయాల్లో శాశ్వత శత్రువులు.. శాశ్వత మిత్రువులు ఉండరని మరోసారి రుజువైందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
