ఇస్లామాబాద్: పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత భీకర దాడులకు భయపడి తనను బంకర్లోకి వెళ్లాలని అధికారులు సూచించారని ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు. అందుకు తాను ఒప్పుకోలేదని జర్దారీ తెలిపారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ దాడులు చేసి మన సత్తా ఏంటో చూపింది. ఇండియా భీకరంగా దాడులు చేయడంతో పాకిస్తాన్ అగ్ర నాయకత్వం భయంతో వణికిపోయింది.
ఆ దేశ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌తో పాటు పలువురు ప్రాణ భయంతో బంకర్లలో తలదాచుకున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీని కూడా బంకర్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. కానీ ఆయన అందుకు ఒప్పులేదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అంగీకరించారు. శనివారం (డిసెంబర్ 27) ఒక బహిరంగ కార్యక్రమంలో ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆత్మ రక్షణ కోసం బంకర్లోకి వెళ్లాలని నా సైనిక కార్యదర్శి సూచించారు. కానీ బంకర్లోకి వెళ్లేందుకు తాను ఒప్పుకోలేదన్నారు. ధైర్యం గల నాయకులు బంకర్లలో చనిపోరని.. యుద్ధభూమిలోనే చనిపోతారని ఆయన అన్నారు.
►ALSO READ | పాకిస్తాన్లో అత్యంత ఓల్డెస్ట్ బ్రాండ్ ఇది.. 50 ఏండ్ల నిషేధం తర్వాత ఎగుమతికి లైసెన్స్.. పెద్ద ప్లానే వేశారు !
జర్దారీ అంగీకారంతో ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ అగ్ర నాయకత్వం ఏ విధంగా భయంతో వణికిపోయిందో స్పష్టం చేస్తోంది. జర్దారీ కంటే ముందు పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియా చేసిన దాడుల్లో తమకు నష్టం వాటిల్లినట్లు ఆయన అంగీకరించారు. భారత కిపణి దాడుల్లో నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ధ్వంసమైనట్లు ఆయన బహిరంగంగా ఒప్పుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పాక్ నేతలు ఇండియా దాడులను బహిరంగంగా అంగీకరించడం గమనార్హం.
