- కన్వీనర్ కోటా సీట్లకూ లక్షల్లో వసూళ్లు చేస్తున్న యాజమాన్యాలు
- హాస్టల్, మెస్, లైబ్రరీ, సౌకర్యాల పేరిట అడ్డగోలు బాదుడు
- అప్పులపాలవుతున్న పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు
హైదరాబాద్, వెలుగు: కష్టపడి ర్యాంకు కొట్టి.. కన్వీనర్ కోటాలో సీటు సాధించినా పేద విద్యార్థులకు ఆర్థిక కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వం ఫీజు కడుతున్నా.. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు మాత్రం సౌకర్యాల పేరుతో విద్యార్థులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. ట్యూషన్ ఫీజు అడగకుండానే.. హాస్టల్, మెస్, లైబ్రరీ, ఏసీ చార్జీలంటూ ఏటా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. సీటు ఫ్రీగా వచ్చినా.. ఈ అదనపు బాదుడు తట్టుకోలేక పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్ అయ్యారు. దీనిపై విచారణ జరిపేందుకు స్పెషల్ కమిటీని వేయాలని అధికారులను ఆదేశించారు.
సౌలత్‌ల పేరుతో అడ్డగోలు దోపిడీ..
రూల్స్ ప్రకారం కన్వీనర్ కోటాలో సీటు పొందిన విద్యార్థులకు ప్రభుత్వమే ట్యూషన్ ఫీజు చెల్లిస్తుంది. కానీ, ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లు మాత్రం దోపిడీకి కొత్త దారులు వెతుకుతున్నాయి. ట్యూషన్ ఫీజు అడగకుండా.. హాస్టల్ ఫీజు, మెస్ చార్జీలు, లైబ్రరీ ఫీజు, ల్యాబ్ ఫీజు, ట్రాన్స్‌పోర్ట్, ఏసీ చార్జీలంటూ రకరకాల పేర్లతో ఏటా రూ. లక్షల్లో వసూలు చేస్తున్నాయి. బయట హాస్టల్స్లో ఉంటామన్నా ఒప్పుకోవట్లేదు. తప్పనిసరిగా తమ కాలేజీ హాస్టల్‌లోనే ఉండాలని, చెప్పినంత కట్టాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే క్లాసులకు అనుమతించబోమని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది.
విద్యార్థుల చదువులపై ప్రభావం..
ఫ్రీ సీటు వచ్చింది కదా అని సంతోషపడేలోపే.. కాలేజీల యాజమాన్యాలు చేతిలో పెడుతున్న ఫీజుల చిట్టా చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. కాలేజీ స్థాయిని బట్టి సౌకర్యాల పేరుతో ఏడాదికి అదనంగా రూ. 2 నుంచి 4 లక్షల వరకు చెల్లించాల్సి వస్తోందని వాపోతున్నారు. యాజమాన్యాల తీరుతో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. ప్రైవేట్ కాలేజీల ఫీజుల దందాపై ఫిర్యాదులు వస్తుండటంతో మంత్రి దామోదర రాజనర్సింహ ఇటీవలే అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. విద్యార్థులను దోపిడీ చేస్తున్న కాలేజీలపై విచారణ జరపాలని ఆదేశించారు. ఇందుకు ప్రత్యేక కమిటీ వేసి వేసి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో స్టడీ చేయాలని సూచించారు. కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా స్టూడెంట్లను ఇబ్బందులు పెడుతున్న కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.
