ముదురు ఆకుపచ్చ కూరగాయలను ఉడికించినా, వేపినా, తిరిగి వెచ్చబెట్టినా.... వాటిలోని పోషక, ఆరోగ్య ప్రయోజనాలు కోల్పోతాయని స్వీడన్ లింకోపింగ్' యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. కూరగాయలు లేదా పండ్లను యధాతథంగా తినడమే మంచిదంటున్నారు. వాటిని రసం రూపంలో లేదా వాటికి పాలు, ఐస్ కలిపి తీసుకోవడం మంచిదని తెలిపారు. ఈ అధ్యయనం 'జర్నల్ ఫుడ్ కెమిస్ట్రీ'లో ప్రచురించారు.
ముదురు కూరగాయలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కళ్లను కూడా కాపాడుతాయి. తాజా కూరగాయల్లో లూటియిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ స్థాయిలు పెరగడానికి, వాటిని ఎలా వినియోగించుకోవాలో పరిశోధకులు తెలిపారు.
లూటియిన్ ప్రాధాన్యం
గుండె సంబంధిత సమస్యలు, ధమనులు సన్నబడటం(అధరోసిరోసిస్), వాపుతో వచ్చే మంట, ఇవన్నీ రక్తంలో ప్రభావం చూపిస్తుంటాయి. మంటతో కూడిన వాపు మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ రావడానికి సంబంధం ఉంటుంది. దీంతో యాంటీ ఆక్సిడెంట్ లూటియిన్ ప్రాధాన్యం ఏమిటో పరిశోధకులు గుర్తించారు. ఇది సహజంగా కొవ్వును కరిగించే గుణం కలిగి ఉంది. ఈ పిగ్మెంట్ మొక్కల్లో.. ముఖ్యంగా ముదురు ఆకుపచ్చ రంగు కలిగిన కూరగాయల్లో పుష్కలంగా ఉంటుంది. పరిశోధకులు ఇది వరకు కరోనరీ ఆర్టరీ వ్యాధి అంటే ధమనులకు సంబంధించిన వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధక కణాల్లోని వాపును, లూయిటిన్ తగ్గించడాన్ని గమనించారు. అంతేకాదు వ్యాధి నిరోధక కణాల్లో లూయిటిన్ నిల్వ ఉండటాన్ని కూడా కనుగొన్నారు.
దీనిబట్టి శరీరంలోనే లూయిటిన్ నిల్వలను వృద్ధి చేసుకోవచ్చని తెలుస్తోంది. ఇదే పరిశోధకులకు రక్తంలో లూయిటిన్ స్థాయిలను పెంపొందించే మార్గం అన్వేషించడానికి దారి తీసింది. లూయిటిన్ పుష్కలంగా ఉన్న ముదురు ఆకుపచ్చ కూరగాయల ఆహారం ద్వారా ఇది సాధ్యమవుతుందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో లూయిటిన్ పొందడానికి అనేక మార్గాలను కనుగొన్నారు.
