హైదరాబాద్: చలికాలం క్లైమాక్స్‌కు చేరుకుంది. మరో వారం, పది రోజుల్లో వింటర్ సీజన్ ముగిసి సమ్మర్ స్టార్ట్ కానుంది. గడిచిన నాలుగు నెలులు చలికి వణికిన జనం ఇక భానుడి ప్రతాపాన్ని భరించాల్సి ఉంటుంది. అయితే.. వేసవి కాలం ప్రారంభంలో ఉదయం వేళల్లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పొగమంచు వాతావరణం ఉంటుందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.
నగరంలో ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రత 16–18 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతుండటంతో నైట్ టైమ్ చలి తీవ్రత తగ్గుతుందని తెలిపింది. తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ డేటా ప్రకారం.. ముషీరాబాద్, అంబర్‌పేట్, చార్మినార్, ఖైరతాబాద్, బండ్లగూడ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ దాటింది.
సమ్మర్ సీజన్ స్టార్ట్ కావస్తోన్నప్పటికీ ఐఎండీ హైదరాబాద్ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయలేదు. అయినప్పటికీ రాబోయే రోజుల్లో నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్ ఉంది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న రంజాన్ మాసంలో సిటీలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
