భారత్ బంద్.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసనలు..తెలంగాణలో భారీ ర్యాలీలు

భారత్ బంద్.. దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల నిరసనలు..తెలంగాణలో భారీ ర్యాలీలు

కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక లోకం కదంతొక్కింది. 10 కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం(ఫిబ్రవరి 12) జరిగిన సార్వత్రిక సమ్మెలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు. నాలుగు లేబర్ కోడ్‌ల రద్దు, ప్రైవేటీకరణ ,(MGNREGA) రక్షణ, విద్యుత్ సవరణ చట్టం ఉపసంహరణ కోసం నిరసనలు, ర్యాలీలు నిర్వహించారు. కార్మిక సంఘాలు చేపట్టిన  భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. 

కార్మికులు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను , చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని కార్మికులు ఆందోళన బాట పట్టారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి, అంబానీ, అదానీలకు వ్యతిరేకంగా ప్లాకార్డులు ప్రదర్శించారు. వెంటనే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.  

తెలంగాణలో జరిగిన ర్యాలీలు, నిరసనల్లో కాంగ్రెస్ నేతలు , కార్యకర్తలు పాల్గొని మద్దతు తెలిపారు. సమ్మెలో భాగంగా హైదరాబాద్లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వరకు కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న అన్ని కార్మిక సంఘాల నేతలు అసంఘటిత కార్మికులు ఆటో యూనియన్లు పాల్గొన్నాయి. మోదీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

►ALSO READ | రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి..గాంధీ సరోవర్ శంకుస్థాపనకు రావాలని ఆహ్వానం

కార్మికులు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతుగా... వామపక్ష పార్టీ నేతలు నారాయణగూడ ఫ్లై ఓవర్ కింద నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, జాన్ వెస్లీ మాట్లాడుతూ...కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ , కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. కార్మికులు సమ్మె చేసే హక్కులను కాలరాస్తూ , అమెరికా సామ్రాజ్య విధానాన్ని మోదీ ప్రభుత్వం అనుసరిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తన కార్మిక వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమంలో వామపక్ష పార్టీలు భాగస్వామ్యం అయ్యి కేంద్ర ప్రభుత్వ మెడలు వంచుతామని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా సమ్మెలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో పలు పారిశ్రామిక వాడల్లో  సంపూర్ణంగా బంద్ పాటించారు కార్మికులు. లేబర్ కోడ్స్ వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 
మరోవైపు హనుమకొండలో కూడా పెద్ద ఎత్తున కార్మికులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆర్ట్స్ కాలేజీ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి, మేయర్ గుండు సుధారనాణి , సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్, కార్మిక సంఘాల నేతలు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో సింగరేణి కార్మికులు ఒక రోజు సమ్మెలో పాల్గొన్నారు. లేబర్ కోడ్ చట్టాలను వ్యతిరేకిస్తూ   నిరసనలు చేపట్టారు. అత్యవసర సిబ్బంది మినహా 4 అండర్ గ్రౌండ్ రెండు ఓపెన్ కాస్ట్ లలోని మిగతా కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. దీంతో  సింగరేణి కి కోట్లలో నష్టం వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.