కడియంపై చర్యలు తీసుకోండి..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

కడియంపై చర్యలు తీసుకోండి..పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు
  •     దేవాదాయ శాఖపై కడియం రివ్యూ నా అధికారాన్ని బలహీనపర్చడమే
  •     ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో అయోమయం సృష్టించడమే
  •     రాజీనామా చేసి పోటీకి వస్తే ఎవరి ఆదరణ ఏమిటో తెలుస్తుందన్న మంత్రి 

హైదరాబాద్, వెలుగు: స్టేషన్ ఘన్‌‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన శాఖలో జోక్యం చేసుకుంటూ తన అధికారాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తున్నారని, ఆయనపై విచారణ జరిపి, పార్టీపరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌కు దేవాదాయ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. గురువారం నార్సింగిలోని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌‌ను ఆయన నివాసంలో మంత్రి కలిశారు. కడియంపై ఫిర్యాదు చేస్తూ ఓ లేఖ అందించారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను తనపైకి ఉసిగొల్పారని, తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారని, ఇప్పుడు కూడా తన శాఖ పరిధిలోని పాలనా వ్యవహారాల్లో అనవసర  జోక్యం చేసుకుంటున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. 

ఇలాంటి చర్యలు ప్రభుత్వ పాలనలో సమన్వయాన్ని దెబ్బతీయడమే కాకుండా, అధికార యంత్రాంగంలో అయోమయం సృష్టించడమేనని ఆరోపించారు. దేవాదాయ శాఖ అధికారులతో కడియం సమీక్ష జరపడం తన ఎమ్మెల్యే పరిధిని అతిక్రమించడమేనని పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువచ్చారు. ఇక ముందు తన శాఖ పరిధిలో జోక్యం చేసుకోకుండా కడియంకు ఆదేశాలు ఇవ్వాలని పీసీసీ చీఫ్‌‌ను మంత్రి కొండా సురేఖ కోరారు. వాస్తవాలు ఏంటో తెలుసుకొని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తానని, పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా చర్యలు ఉంటాయని తనకు పీసీసీ చీఫ్ హామీ ఇచ్చినట్టు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. 

పోటీచేసి గెలవాలని సవాల్​

అనంతరం మంత్రి కొండా సురేఖ తన ఇంటిలో మీడియాతో మాట్లాడారు. కడియంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడియం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పుకోవడం ఎందుకని, పదవికి రాజీనామా చేయాలని.. మళ్లీ పోటీచేసి గెలిచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అని కాలర్ ఎగిరేసుకొని చెప్పుకోవచ్చు కదా అని సవాల్ చేశారు. తమతో పోటీకి వస్తే ఎవరి ఆదరణ ఏంటో తెలుస్తుందని తెలిపారు. జనంలో ఆయనకు అంత మద్దతే ఉంటే  పార్లమెంట్ ఎన్నికల్లో బిడ్డతో పాటే ఆయన ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిస్తే అయిపోయేది కదా అని చెప్పారు. ఎమ్మెల్యేగా దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయానికి పోవడాన్ని తాను తప్పుపట్టడం లేదని, ఆ ఆఫీసులో అధికారికంగా అధికారులతో రివ్యూ చేయడం తప్పు అని మంత్రి పేర్కొన్నారు.

సచిన్ సావంత్ వద్దకు  కొండా, కడియం పంచాయితీ

మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య కొనసాగుతున్న పంచాయితీ తారా స్థాయికి చేరింది. ఈ పంచాయితీని పరిష్కరించే బాధ్యతను ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ కు అప్పగించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్ ఇద్దరు గురువారం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. కొండా.. కడియం సమస్య పరిష్కరించే బాధ్యత సచిన్ సావంత్ కు అప్పగించారు. ఈ ఇద్దరి విషయంలో ఏఐసీసీ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోననే ఉత్కంఠ వరంగల్ జిల్లా రాజకీయాల్లో నెలకొంది.