- ఏఐని చూసి భయపడొద్దు.. సేవల నాణ్యత పెంచుకోవాలి : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా
వరంగల్/హనుమకొండ, వెలుగు : 'కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి లబ్ధిదారుడికి చేరేలా ఆఫీసర్లు సమర్ధవంతంగా పనిచేయాలి' అని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, ఇతర శాఖల అధికారులతో గురువారం హనుమకొండ కలెక్టరేట్‍లో నిర్వహించిన మీటింగ్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో కలిసి గవర్నర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీబీ నిర్మూలనకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ఆఫీసర్లు ప్రాధాన్యం ఇవ్వాలని, అధిక ఆదాయం వచ్చే పంటలు, విలువ ఆధారిత వ్యవసాయం వైపు రైతులను తీసుకెళ్లాలని చెప్పారు.
అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులకు దారి తీసిన ఏఐ కారణంగా భవిష్యత్ లో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. దానిని సమర్ధవంతంగా ఉపయోగించుకొని పాలన, సేవల్లో నాణ్యత పెంచుకోవాలని సూచించారు.
డ్రగ్స్ రహిత భారత్, డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంతో ముందుకెళ్లాలని సూచించారు. డ్రగ్ర్ మత్తు పదార్థాల నిర్మూలనలో మీడియా నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చెప్పారు. అంతకుముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'నషా ముక్త్ భారత్ అభియాన్ డ్రగ్స్ రహిత తెలంగాణ' కార్యక్రమంలో పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల స్టాళ్లను ప్రారంభించారు. మధ్యాహ్నం హనుమకొండ రెడ్‍క్రాస్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తర్వాత సాయంత్రం ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో నిర్వహించిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ప్రోగ్రామ్ కు హాజరయ్యారు.
అనంతరం భద్రకాళి ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. గవర్నర్ వెంట శాసనసభ మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గవర్నర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిశోర్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‍రెడ్డి, కేఆర్.నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‍పాయ్, సత్యశారద, వరంగల్ సీపీ శ్వేతారెడ్డి, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ వెంకన్న ఉన్నారు.
