రికవరీ ఏజెంట్లు ఇకపై మిమ్మల్ని వేధించలేరు: ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే! ఇంటికి వస్తే ఎం చేయాలంటే..

రికవరీ ఏజెంట్లు ఇకపై మిమ్మల్ని వేధించలేరు:  ఆర్బీఐ కొత్త రూల్స్ ఇవే! ఇంటికి వస్తే ఎం చేయాలంటే..

బ్యాంకు అప్పులు వసూలు చేసే పేరుతో రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇబ్బంది పెడితే ఇకపై కుదరదు. దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) చాలా కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది. రికవరీ ఏజెంట్లు ఇకపై కస్టమర్లతో అసభ్య ప్రవర్తన చేయకూడదు. బూతులు తిట్టడం, శారీరక హింసకు పాల్పడటం లేదా మానసిక ఒత్తిడికి గురిచేయడం నిషేధం చేసింది. అలాగే సోషల్ మీడియా వేధింపులు అంటే వాట్సాప్‌లో మెసేజ్‌లు పెట్టడం, కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ఫోన్ చేసి వేధించడం చేయకూడదు. వీటితో పాటు అబద్ధాలు చెప్పకూడదు అంటే  తప్పుడు సమాచారంతో కస్టమర్లను భయపెట్టకూడదు.

రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల లోపు మాత్రమే సంప్రదించాలి. ఆ తర్వాత ఫోన్ చేసినా, ఇంటికి వచ్చినా అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది. పండుగలు, పెళ్లిళ్లు లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు.

బ్యాంకులు పాటించాల్సిన రూల్స్:
ఎవరైనా ఏజెంట్‌ను పంపే ముందు బ్యాంకు మీకు SMS లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి. ఏజెంట్ దగ్గర తప్పనిసరిగా ఐడీ కార్డు, ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉండాలి. బ్యాంకులు వెబ్‌సైట్‌లో రికవరీ ఏజెంట్ల పేర్లు, ఫోన్ నంబర్లు ఉంచాలి. ఏజెంట్ చేసే ప్రతి కాల్ రికార్డ్ చేయాలి. మాట్లాడే ముందే ఈ కాల్ రికార్డ్ అవుతుంది అని మీకు చెప్పాలి.

రికవరీ ఏజెంట్ ఇంటికి వస్తే ఏం చేయాలి:
ఎవరైనా రికవరీ ఏజెంట్ మీ ఇంటికి వస్తే మొదట ఏజెంట్ ఐడీ కార్డు, బ్యాంకు నుంచి వచ్చిన లెటర్ అడగండి. మీతో రికవరీ ఏజెంట్ దురుసుగా ప్రవర్తిస్తే ఆ మాటల  సంభాషణ మీ మొబైల్‌లో రికార్డ్ చేయండి. తరువాత ముందుగా బ్యాంకులో ఫిర్యాదు చేసి..  మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యాంకు మీ లోన్ రికవరీ ప్రక్రియను ఆపివేయాలి. ఒక వేళా బ్యాంకు స్పందించకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్ (Ombudsman)కు  డైరెక్ట్ ఫిర్యాదు చేయవచ్చు.

అప్పు కట్టడం కస్టమర్ బాధ్యత, కానీ వసూలు చేసేటప్పుడు మర్యాదగా ప్రవర్తించడం బ్యాంకు బాధ్యత. ఈ నిబంధనలు తెలియడం వల్ల మీరు అనవసరమైన భయాందోళనల నుండి బయటపడవచ్చు.