జార్ఖండ్‌‌‌‌లో స్టూడెంట్లపై లాఠీచార్జ్.. వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం

జార్ఖండ్‌‌‌‌లో స్టూడెంట్లపై లాఠీచార్జ్.. వేలాది మంది విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం
  • వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించిన పోలీసులు
  • అనేక మంది స్టూడెంట్లకు గాయాలు 
  • నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా17వ రోజు ఆందోళన
  • జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్ అరెస్ట్  
  • మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభం

రాంచీ: జార్ఖండ్‌‌‌‌లో స్టూడెంట్లపై లాఠీ విరిగింది. ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం రాంచీలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. నిరసనకారులు బారికేడ్లను బద్దలుకొట్టి అసెంబ్లీ సమీపానికి చేరుకోగా పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో అనేక మందికి ముఖం, కాళ్లు, చేతులపై గాయాలయ్యాయి. 

తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మధ్యాహ్నం నుంచి మరుసటిరోజుకు వాయిదాపడ్డాయి. నియామక పరీక్షల అక్రమాలపై నిరసన సోమవారం17వ రోజుకు చేరుకున్న సందర్భంగా అభ్యర్థులు తమ డిమాండ్ల సాధన కోసం పాత అసెంబ్లీ భవనం నుంచి ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ర్యాలీని ప్రారంభించారు.

అయితే, భారీగా భద్రతా బలగాల మోహరింపు మధ్య ఒకదాని తర్వాత మరొక బారికేడ్‌‌‌‌‌‌‌‌ను దాటుకుంటూ నిరసనకారులు ముందుకు దూసుకెళ్లారు. ‘‘జేఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీసీజీఎల్ పరీక్షలను రద్దు చేయాలి లేదా సీబీఐ విచారణ జరిపించాలి’’, ‘‘జేఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీపై రెయిడ్ చేయడానికి సీఐడీ ఎందుకు పారిపోతోంది?’’, ‘‘నిష్పక్షపాత విచారణ జరిపించాలి, నిజం బయటపెట్టాలి’’ అని రాసి ఉన్న ప్లకార్డులను, త్రివర్ణ పతాకాలను పట్టుకుని వేలాదిమంది యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

ర్యాలీ జగన్నాథ్ పూర్ ఆలయానికి చేరుకోగానే పోలీసులు వాటర్ కెనాన్లు ప్రయోగించడంతో, ఆందోళనకారులు త్రివర్ణ పతాకాలను ఊపుతూ నృత్యం చేశారు. కొద్దిసేపటికి వారంతా ముందుకు సాగడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు లాఠీచార్జీ చేశారు. చివరకు నిరసనకారులు అసెంబ్లీకి సుమారు 200 మీటర్ల దూరం వరకూ దూసుకెళ్లారు. దీంతో వారిపైకి పోలీసులు అనేక రౌండ్లు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు.

భారీగా బలగాల మోహరింపు 
అసెంబ్లీ మార్చ్ రూట్‌‌‌‌‌‌‌‌లో నిషేధాజ్ఞలను విధించడంతో పాటు, దాదాపు 4 కిలోమీటర్ల పొడవున్న మొత్తం మార్గంలో భారీగా బలగాలను దింపారు. రాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జిల్లా పోలీసులు, క్యూఆర్‌‌‌‌‌‌‌‌టీ నుంచి 1,500 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. 

ర్యాలీలో పాల్గొనడానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్థులు రైళ్లు, బస్సులు, ఇతర వాహనాలలో పెద్ద సంఖ్యలో రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. అయితే, రాజధానిని చేరుకునే విద్యార్థుల సంఖ్యను పరిమితం చేయడానికి పోలీసులు, జిల్లా సరిహద్దులు, ప్రధాన రహదారులు, హైవేలపై బస్సులు, ప్రైవేట్ వాహనాలను కూడా తనిఖీ చేశారు.

లాఠీచార్జ్‌‌‌‌‌‌‌‌పై విద్యార్థుల ఆగ్రహం 
శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపట్టిన తమపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం, బ్యాటన్‌‌‌‌‌‌‌‌లతో షాకులు ఇవ్వడంపై నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై తొమ్మిది రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జెఎల్‌‌‌‌‌‌‌‌కేఎం నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో అంబులెన్స్‌‌‌‌‌‌‌‌లో వచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. ఆయన మాజీ సీఎం శిబూ సోరెన్ చిత్రపటాన్ని పట్టుకుని కనిపించారు.

అసెంబ్లీ మార్గంలో ముళ్ల కంచెలతో కూడిన బారికేడ్లను ఏర్పాటు చేయడంపై ఫైర్ అయ్యారు. ‘‘మా గొంతును అణచివేయడానికి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. మేం ఇకపై ఎలాంటి చర్చలు జరపం’’ అని స్పష్టం చేశారు. ‘‘లాఠీచార్జీ క్రూరమైనది. చాలామంది విద్యార్థినులు గాయపడ్డారు. పోలీసులు మా తలపై, చేతులపై, ముఖంపై ప్రతిచోటా కొట్టారు’’ అని పీయూష్ కుమార్ సోని అనే ఆందోళనకారుడు తెలిపారు.

కాగా, సంఘ వ్యతిరేక శక్తులు ర్యాలీలో చేరకుండా నిరోధించడానికి సుమారు 500 మంది స్వచ్ఛంద సేవకులను మోహరించామని ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న జేపీఎస్‌‌‌‌‌‌‌‌సీజేఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ రిఫార్మ్స్ మంచ్ తెలిపింది. కాగా, 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జేఎల్‌‌‌‌‌‌‌‌కేఎం నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో సోమవారం విద్యార్థుల మార్చ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. 

మహతో రక్తంలో చక్కెర స్థాయి భారీగా పడిపోవడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా, విద్యార్థులపై పోలీసులు లాఠీలు ప్రయోగించిన ఈ రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర అధ్యక్షుడు శశాంక్ రాజ్ ఫైర్ అయ్యారు. మరోవైపు, బీజేపీ తన రాజకీయ లబ్ధి కోసం ఈ నిరసనను హైజాక్ చేసిందని రాష్ట్ర మంత్రి సుదివ్య కుమార్ ఆరోపించారు.

చర్చలు విఫలం.. తొలగని ప్రతిష్టంభన 
ఆందోళనకారులతో రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చర్చలు జరిపినా.. ప్రతిష్టంభనను తొలగించడంలో విఫలమైంది. తాము రద్దు చేయాలని కోరిన 13 పరీక్షలలో మూడింటిని మాత్రమే రద్దు చేయడానికి ప్రభుత్వం అంగీకరించిందని ఆందోళనకారులు తెలిపారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌‌‌‌‌‌‌‌సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ)లలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని పేర్కొన్నారు. 

14వ జార్ఖండ్ పీఎస్‌‌‌‌‌‌‌‌సీ సివిల్ సర్వీసెస్ పరీక్షతో సహా అనేక నియామక పరీక్షలను రద్దు చేయాలని, సీబీఐ ద్వారా లేదా రాష్ట్రం వెలుపల పదవీ విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తుల ప్యానెల్ ద్వారా అక్రమాలపై స్వతంత్ర విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కాగా, 17 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలో భాగంగా ప్రస్తుతం ఆరుగురు విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారు.

జేపీఎస్‌‌‌‌‌‌‌‌సీ మాజీ చైర్మన్ అరెస్ట్
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌‌‌‌‌‌‌‌సీ) నియామక పరీక్షల నిర్వహణలో జరిగిన అక్రమాలకు సంబంధించి ఆ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్. ఖియాంగ్తేను సోమవారం జార్ఖండ్ సీఐడీ అరెస్ట్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్ అయిన తర్వాత గత ఏడాది ఫిబ్రవరిలో జేపీఎస్‌‌‌‌‌‌‌‌సీ చైర్మన్‌‌‌‌‌‌‌‌గా నియమితులైన ఖియాంగ్తే, జులై 22న తన రాజీనామాను సమర్పించారు.

జులై 28 నుంచి ఖియాంగ్తేను సీఐడీ అధికారులు నాలుగుసార్లు విచారించారు. పరీక్షల్లో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో జేపీఎస్‌‌‌‌‌‌‌‌సీ సభ్యులందరూ ఆదివారమే రాజీనామా చేశారు. మరోవైపు సోమవారం విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి ర్యాలీ కొనసాగుతుండగానే ఖియాంగ్తేను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఖియాంగ్తే అరెస్ట్‌‌‌‌‌‌‌‌తో ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన వారి సంఖ్య 20కి పెరిగింది.

విద్యార్థులపై లాఠీచార్జ్ అన్యాయం: రాహుల్ గాంధీ 
రాంచీలో విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం అన్యాయమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. సోమవారం ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందిస్తూ.. విద్యార్థులకు శాంతియుత నిరసన తెలిపే హక్కు ఉందని, ఏ సమస్యకైనా కేవలం చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని స్పష్టం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం తక్షణమే స్పందించి విద్యార్థులతో చర్చలు జరపాలని రాహుల్ గాంధీ కోరారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
జార్ఖండ్‌‌‌‌‌‌‌‌లో పలు నియామక పరీక్షల నిర్వహణలో, ప్రత్యేకంగా జేఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌సీ-సీజీఎల్‌‌‌‌‌‌‌‌ పరీక్షలో అక్రమాలపై ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీలాండరింగ్ కేసు దర్యాప్తును ప్రారంభిం చిందని అధికారులు సోమవారం తెలిపారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ కింద దర్యాప్తును ప్రారంభించడానికి కేంద్ర సంస్థ రాష్ట్ర పోలీసు సీఐడీ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఆర్, కొన్ని ఇతర ఫిర్యాదులు, చార్జ్‌‌‌‌‌‌‌‌షీట్‌‌‌‌‌‌‌‌లను పరిగణనలోకి తీసుకుందని వారు చెప్పారు. సాక్ష్యాల సేకరణ, ఈ కేసులతో సంబంధం ఉన్నవారికి సమన్లు జారీ చేయడం, నిందితుల ఆస్తులను జప్తు చేయడం వంటి తదుపరి చర్యలను ఈడీ త్వరలోనే ప్రారంభించనుందని తెలిపారు.