- ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న సైబర్ కాల్నెట్వర్క్ను ఛేదించిన పోలీసులు
- మూడు సైబర్ కాల్ సెంటర్లపై దాడులు
- ఈ నెట్‌వర్క్‌లో టెలీకాలర్స్‌గా ఉన్న తెలంగాణకు చెందిన 21 మంది మహిళలు అరెస్ట్
హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలో కేంద్రంగా సాగుతున్న సైబర్ మోసాల కాల్ సెంటర్ నెట్‌వర్క్‌ను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) ఛేదించింది. ఢిల్లీలోని శివ మార్కెట్‌లో నిర్వహిస్తున్న మూడు సైబర్ కాల్ సెంటర్లపై ఏకకాలంలో దాడులు చేసిన అధికారులు.. 21 మంది తెలుగు మాట్లాడే మహిళా టెలీకాలర్లతోపాటు ఓ బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కాల్ సెంటర్లను నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకులు లలిత్ సింగ్, కుల్దీప్ సింగ్, అనిల్ పరారీలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్ సుమారు ఏడాదిన్నరగా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. టీజీ సీఎస్‌బీ డైరెక్టర్ శిఖాగోయల్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దాడుల్లో 23 మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్‌లను టీజీసీఎస్‌బీ స్వాధీనం చేసుకుంది. దర్యాప్తులో తెలంగాణ వ్యాప్తంగా నమోదైన 22 సైబర్ కేసులతో ఈ కాల్ సెంటర్లకు సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మరిన్ని కేసులు, బాధితులు, ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.
తెలుగు మాట్లాడే మహిళలతో టార్గెట్
ఢిల్లీలోని నకిలీ కాల్ సెంటర్ల ముఠా తెలుగులో అనర్గళంగా మాట్లాడే 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న మహిళలను టెలీకాలర్లుగా నియమించుకుని రాష్ట్ర ప్రజలను లక్ష్యంగా చేసుకున్నట్లు టీజీసీఎస్బీ గుర్తించింది. వీరిలో పలువురు జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్, బోరబండ, మహబూబ్‌నగర్ ప్రాంతాలకు చెందినవారున్నట్లు వెల్లడైంది. తెలుగు భాషపై ఉన్న పట్టు, మహిళలతో ఫోన్లు చేయిస్తూ అమాయకులకు ఎరవేస్తున్నట్టు తేలింది. ముందుగానే రాసి ఇచ్చిన స్కిప్ట్ ప్రకారం ఈ టెలీకాలర్స్ మాట్లాడుతూ మోసాలకు తెరతీస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.
‘బజాజ్ ఫైనాన్స్’ పేరుతో బురిడీ..
ముఠా సభ్యులు బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధులమంటూ ప్రజలకు ఫోన్ చేసేవారని, తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పిస్తామని నమ్మించేవారని అధికారులు తెలిపారు. రుణ ప్రాసెసింగ్ ఫీజు, వెరిఫికేషన్ చార్జీలు, డాక్యుమెంటేషన్ ఫీజు, బీమా ప్రీమియం తదితర పేర్లతో విడతలవారీగా డబ్బులు వసూలు చేసేవారని పేర్కొన్నారు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగితే బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌కు పాల్పడేవారని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పరువు తీస్తామని, వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేస్తామని సైబర్ నేరగాళ్లు భయపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. మహిళలు ఫోన్ చేయడం, తెలుగులో లేదా ఇతర ప్రాంతీయ భాషల్లో మాట్లాడటం మాత్రమే చూసి వారిని నమ్మవద్దని టీజీసీఎస్‌బీ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇతర ఛార్జీలు చెల్లించే ముందు.. ఫోన్ కాల్ చేసిన వ్యక్తి, సంస్థ నిజమైనవో కాదో ధ్రువీకరించుకోవాలని సూచించింది. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయడంతోపాటు cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని టీజీసీఎస్‌బీ అధికారులు సూచించారు.
