అమిత్ షా స్పీచ్ కాదు.. మాకు ఆన్సర్ కావాలి: రాహుల్ గాంధీ

అమిత్ షా స్పీచ్ కాదు.. మాకు ఆన్సర్ కావాలి: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్​షా సభకు రావాలని పిలిచేది ఆయన ప్రసంగం వినడానికి కాదని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. దేశ రాజధానిలో మన విద్యార్థులపై పెల్లెట్లు, లాఠీలు, తూటాలతో అమానుష దాడికి బాధ్యులు ఎవరనేది అమిత్​షా నోటివెంట వినాలని అనుకుంటున్నట్లు తెలిపారు. 

ప్రతిపక్షాల డిమాండ్ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్​షా సభకు వచ్చి విద్యార్థుల ఆందోళనలకు సంబంధించి ప్రకటన చేస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సోమవారం సభలో వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ అగ్రనేతలు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమిత్​షా సభకు రావాలంటూ తాము చేస్తున్న డిమాండ్ వెనక ‘విద్యార్థులపై దాడులకు ఆదేశించింది ఎవరు?’ అనేది తెలుసుకోవాలన్న ఉద్దేశం ఉందన్నారు.

అమిత్​షా లోక్ సభలో చేసే ప్రసంగంపై కానీ, ఊహాజనిత సంభాషణలపై కానీ తమకు ఎలాంటి ఆసక్తి లేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్షంగా ‘అమిత్​షా ఆదేశించారా లేదా?.. లేక విద్యార్థులపై దాడి జరిగిన విషయమే ఆయనకు తెలియదా? కేంద్ర హోంమంత్రిగా ఆయన ఆదేశించకుంటే ఎవరు ఆర్డర్ ఇచ్చారు?’ అనే ప్రశ్నలకు తాము జవాబులు ఆశిస్తున్నట్లు వివరించారు. 

విద్యార్థులపై దాడులకు ఆదేశించింది అమిత్​షానే అయితే ఆయన దోషి అవుతారని, దాడి విషయం తెలియనే లేదంటే.. అప్పుడు కేంద్ర హోంమంత్రి పదవికి ఆయన అన్ ఫిట్ అని తేల్చిచెప్పారు. ఈ రెండు సందర్భాల్లో ఏది నిజమైనా సరే.. అమిత్​షా తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు.