నేచురల్ స్టార్ నాని , మాస్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర ఒక సెన్సేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన 'దసరా' సృష్టించిన ప్రభంజనం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి, అంతకు మించిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అదే "ది ప్యారడైజ్" (The Paradise). తాజాగా ఈ సినిమా విడుదల తేదీపై చిత్ర యూనిట్ క్లారిటీ ఇస్తూ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది.
ఆగస్ట్ 21న బాక్సాఫీస్ టేకోవర్!
నిజానికి ఈ సినిమాను 2026, మార్చి 26న ఉగాది కానుకగా విడుదల చేయాలని మేకర్స్ తొలుత ప్లాన్ చేశారు. కానీ భారీ స్థాయిలో విజువల్స్ ఉండటం, ఇంకా సుమారు 60 రోజులకు పైగా షూటింగ్ బ్యాలెన్స్ వంటి కారణాలతో విడుదల తేదీని వాయిదా వేశారు. లేటెస్ట్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక స్ట్రైకింగ్ పోస్టర్‌ను విడుదల చేస్తూ, 2026, ఆగస్ట్ 21న "ది ప్యారడైజ్" ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. 5 నెలల ఆలస్యమైనా సరే, నాని ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా ఈ చిత్రం ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
కథా నేపథ్యం..
ఈ 'ది ప్యారడైజ్' చిత్రం కేవలం యాక్షన్ చిత్రంగానే మాత్రమే కాదు. ఒక బలమైన సామాజిక ఇతివృత్తంతో సాగే పీరియడ్ యాక్షన్ థ్రిల్లర్. సమాజంలో వివక్షకు గురైన ఒక తెగ కోసం పోరాడే 'జడల్' అనే వ్యక్తి ప్రయాణమే ఈ సినిమా. పౌరసత్వం కోసం, వ్యవస్థాగతమైన అన్యాయాలకు వ్యతిరేకంగా ఆ తెగ చేసే పోరాటానికి జడల్ ఎలా నాయకత్వం వహించాడు అనేది గుండెలకు హత్తుకునేలా శ్రీకాంత్ ఓదెల చూపించబోతున్నారు.
భారీ తారాగణంతో..
ఈ సినిమాలో నానితో పాటు వైవిధ్యమైన స్టార్ కాస్టింగ్ ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక కీలకమైన , పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ ఈ చిత్రంతో తెలుగులోకి అడుగుపెడుతూ ప్రాధాన్యత ఉన్న పాత్ర పోషిస్తున్నారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఒక సీరియస్ రోల్‌లో మెరవబోతుండటం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. సోనాలి కులకర్ణి కీలక పాత్రలో అలరించనుంది.
పాన్ ఇండియా రిలీజ్
ఎస్.ఎల్.వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ 'ది ప్యారడైజ్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్, సి.హెచ్. సాయి సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలు చేకూర్చనుంది.. ఈ విజువల్ వండర్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 8 భాషల్లో 2026, ఆగస్ట్ 21న విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. ఇది నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న చిత్రంగా 'ది ప్యారడైజ్' నిలువనుంది.
I don’t want to rush.
— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026
I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3
