జ్యోతిష్యం:  మహాశివరాత్రి రోజు శివుడిని.. ఏరాశి వారు ఎలా పూజించాలి.. నైవేద్యం  సమర్పించాల్సినవి  ఇవే..! 

జ్యోతిష్యం:  మహాశివరాత్రి రోజు శివుడిని.. ఏరాశి వారు ఎలా పూజించాలి.. నైవేద్యం  సమర్పించాల్సినవి  ఇవే..! 

పురాణాల ప్రకారం మహాశివరాత్రి  రోజుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆరోజు పరమేశ్వరుడికి అభిషేకాలు.. ప్రత్యేక పూజలు చేస్తారు.ఈ ఏడాది అలాంటి పర్వదినం ఫిబ్రవరి 15న వచ్చింది.  ఆరోజున బఉపవాసం ఉండి, రాత్రంతా మేల్కొని శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి శివ మంత్రాలను జపిస్తారు.  జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం పార్వతి పరమేశ్వరులను ప్రసన్నం చేసుకునేందుకు  మహాశివరాత్రి నాడు  ఏరాశి వారు ఎలా పూజ చేయాలో తెలుసుకుందాం.   

 మేష రాశి:  మహాశివరాత్రి పర్వదినాన శివ పూజ సమయంలో లింగాష్టకాన్ని  జపిస్తే మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈశ్వరుడికి ఎర్రటి పువ్వులు, ఎర్రచందనం, ఎర్రని రంగులో ఉండే పండ్లను సమర్పిస్తే శివకటాక్షం లభిస్తుంది. శివుడికి తేనె సమర్పించాలి. తేనె స్వచ్ఛంగా ఉండాలి. చెరకు రసంతో శివలింగానికి అభిషేకం చేయాలి.

వృషభ రాశి :ఈ రాశి వాళ్లు పచ్చి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. పాయసం నైవేద్యంగా పెట్టాలి.మల్లెపూలతో శివారాధన చేసుకోవాలి. తర్వాత రుద్రాష్టకం చదువుకోవాలి.ఇలా చేస్తే   సంపద కలుగుతుందని  జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.  

మిథున రాశి:  మిథున రాశి వారు బిల్వ పత్రాలు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి.  శివాష్టకాన్ని పఠిస్తే, శక్తి సామర్ధ్యాల మేరకు శివరాత్రి వేళ దానధర్మాలు చేస్తే శుభం కలుగుతుంది. అనేక రెట్లు పుణ్యం లభిస్తుంది.శివలింగానికి నీలిరంగు పువ్వులు సమర్పించి దీపం వెలిగించి పూజించండి. దీని వల్ల  అనేక సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు. 

 కర్కాటక రాశి: ఈ రాశి వారు మహా శివరాత్రి రోజున   వెన్నతో శివలింగానికి అభిషేకం చేయాలి. 
 రుద్రాష్టాధ్యాయిని పఠించాలి. దీని వలన మీరు ఆంతరంగికంగా శాంతిని పొందుతారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతను ఏర్పడుతుంది.  తరువాత స్వామి వారిఇ  స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గి, శాంతి వస్తుంది.

సింహ రాశి: ఈ రాశి వారు మహా శివరాత్రి నాడు ఎర్రని తామరలతో శివుడికి పూజ చేసుకోవాలి. శివాలయంలో శ్రీ శివ చాలీసా పారాయణం చెయ్యాలి.శివుని పూజలో పెరుగు, చక్కెర, బియ్యం, తెల్ల చందనం ఉపయోగించాలి.

 కన్యా రాశి: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశి వారు పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. జామ, పైనాపిల్ లాంటి పచ్చని పండ్లు సమర్పించాలి. బిల్వాష్టకం చదువుతూ స్వామివారిని పూజించాలి. దీనివలన ఐశ్వర్యం వృద్ది చెందుతుందని పండితులు చెబుతున్నారు. 

 తులా రాశి: శివుని ప్రసన్నం చేసుకోవడానికి,శివరాత్రి  రోజున మహాదేవునికి పంచదారతో అభిషేకం చేసి శివాష్టకం పఠించండి . శివుడికి నల్ల పువ్వులు, బెల్లం లేదా పంచదార మిఠాయిని శివుడికి సమర్పించాలి. గుడికి పంచదార దానం చేయాలి. దీని వల్ల అన్ని పనుల్లో విజయం వస్తుంది.

వృశ్చిక రాశి : ఈ రాశి వారు మహాశివరాత్రి వేళ  రుద్రాష్టకం పఠిస్తే కష్టాలన్నీ తొలగిపోతాయి. శివుని ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. బెల్లం, పెరుగుతో శివునికి అభిషేకం చేయాలి. వీరు గులాబీ పువ్వులను, బిల్వపత్రాలను శివుడికి సమర్పిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.

ధనుస్సు రాశి: ఈ రాశి వారు  కుంకుమపువ్వు కలిపిన నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి. ఆపిల్ పండును సమర్పించాలి. ఎర్రటి వస్త్రాన్ని బ్రాహ్మణుడికి దానం చేయాలి. శివలింగానికి గంధం పూయాలి. పసుపు పూలతో పూజ చేయాలి. దీని వల్ల అదృష్టం కలిసి వస్తుంది.

మకర రాశి: మహాశివరాత్రి పర్వదినాన ఈ  రాశి వారు శివుడికి అభిషేకాలు, అర్చనలు చేస్తే సమస్యల నుండి పరిష్కారం దొరుకుతుంది. విజయాలు వరిస్తాయి. నల్ల నువ్వులు కలిపిన నీటితో శివుడికి అభిషేకం చేయాలి. డ్రై ఫ్రూట్స్ సమర్పించాలి. దీని వల్ల అన్ని సమస్యలు తీరుతాయి.

కుంభరాశి: ఈ రాశి వారు  మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివుడిని ప్రత్యేకంగా పూజించడం ద్వారా మంచి సానుకూల ఫలితాలు లభిస్తాయి. శివునికి పాలు, పెరుగు, పంచదార, నెయ్యి, తేనెతో అభిషేకం చేసి, దానితో పాటు ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి.పరమేశ్వరునికి  నీలం రంగు పువ్వులు సమర్పించాలి.  శివ కళ్యాణం చేయించుకోవాలి. 

మీన రాశి: ఈ రాశి వాళ్లు శివుడికి పసుపు పండ్లు సమర్పించాలి. ఆకలితో ఉన్నవాళ్లకు అన్నం పెట్టాలి. దక్షిణ ఇవ్వాలి.  తేనె, గంగాజలంతో.. పండ్ల రసంతో  శివుని అభిషేకించాలి.దానితో పాటు ఓం భవేశ్వరాయ నమః  అనే మంత్రాన్ని జపించండి.ఇలా చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి