భారతదేశ రక్షణ రంగ చరిత్రలో ఒక అద్భుతమైన మైలురాయి నమోదైంది. మన దేశానికి చెందిన ముగ్గురు భారత వైమానిక దళ (IAF) శిక్షకులు (Qualified Flying Instructors) బ్రిటన్ వెళ్లనున్నారు. అక్కడ వారు బ్రిటీష్ రాయల్ ఎయిర్ ఫోర్స్ (RAF) కు చెందిన 'ఫాస్ట్ జెట్' పైలట్లకు యుద్ధ విమానాలు నడపడంలో శిక్షణ ఇస్తారు.
బ్రిటన్‌లోని 'RAF వ్యాలీ' అనే శిక్షణ కేంద్రంలో మన భారతీయ అధికారులు రెండేళ్ల పాటు అక్కడి పైలట్లకు శిక్షణ ఇస్తారు. అలాగే బ్రిటీష్ పైలట్లకు 'హాక్ T2' లేదా 'టెక్సాన్ T1' వంటి అధునాతన యుద్ధ విమానాలపై శిక్షణ ఇస్తారు. బ్రిటీష్ వైమానిక దళం కోసం భారతీయులు ఫాస్ట్ జెట్ శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారి.
బ్రిటన్‌కు చెందిన మూడు ప్రధాన సైనిక అకాడమీ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ లో ఇప్పుడు భారతీయ అధికారులు శిక్షకులుగా ఉండటం మన దేశ ప్రతిభకు నిదర్శనం. గతంలో 2025లో భారత ప్రధాని, బ్రిటన్ ప్రధాని మధ్య జరిగిన ఒప్పందాల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేవలం శిక్షణ మాత్రమే కాకుండా, రెండు దేశాలు కలిసి అనేక వ్యాయామాలు (Exercises) చేస్తున్నాయి. 2025లో రెండు దేశాల నావికాదళాలు అతిపెద్ద సముద్ర విన్యాసాలు నిర్వహించాయి. రాజస్థాన్‌లో 'అజేయ వారియర్' పేరుతో సైనిక విన్యాసాలు జరిగాయి. ఒకప్పుడు మన దేశం ఇతర దేశాల నుండి యుద్ధ విద్యలను నేర్చుకునేది, కానీ ఇప్పుడు మన వైమానిక దళ అధికారుల స్కిల్స్ చూసి బ్రిటన్ వంటి అగ్రరాజ్యాలు అక్కడి పైలట్లకు శిక్షణ ఇవ్వమని కోరుతుండటం విశేషం.
