- డీసీసీ అధ్యక్షుడు నరేశ్జాదవ్
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎన్నో ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ ఫైర్అయ్యారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో గాంధీ పేరు తొలగింపును నిరసిస్తూ ఆదివారం పట్టణంలోని గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ నేతలతో కలిసి నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. పేదలకు, గ్రామీణ ప్రాంత కూలీలకు భరోసాగా ఉన్న పథకాన్ని నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర చేస్తుందని మండిపడ్డారు.
నల్లధనం తీసుకొచ్చి దేశంలోని ప్రతి వ్యక్తి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పిన ప్రధాని మోదీ మాట నిలబెట్టుకోకుండా దేశ సంపదను అంబానీ, అదానీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గుడిపెల్లి నగేశ్, అంబకంటి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఖానాపూర్ లో కాంగ్రెస్ నిరసన
ఖానాపూర్, వెలుగు: ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరును తొలగించడం పట్ల ఖానాపూర్ లో కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. మున్సిపల్ ఆఫీస్ ముందున్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. మోదీ సర్కార్ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే కుట్రను ప్రతి ఒక్కరూ తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. ఉపాధి హామీ పథకం పేరును యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్దుల్ మాజీద్, ఆత్మ చైర్మన్ తోట సత్యం, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల రమేశ్, నాయకులు షబ్బీర్ పాషా, నేత శ్యామ్, జహీర్, షౌకత్ పాషా, నయీం తదితరులు పాల్గొన్నారు.
