- ప్రకృతి ఒడిలో పుస్తక పఠనం చేయాలని పిలుపు
ఆదిలాబాద్, వెలుగు: సామాజిక మాధ్యమాలకు పరిమితం కాకుండా పుస్తక పఠనం ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. గ్రంథాలయ ఉద్యమంలో భాగంగా ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలోని గాంధీ పార్క్లో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుస్తకాలు మనిషికి నిజమైన నేస్తాలని, అవి ప్రపంచాన్ని పరిచయం చేయడమే కాక వ్యక్తిత్వ వికాసానికి దోహదపడతాయని అన్నారు. ప్రస్తుత జీవనశైలిలో ప్రజలు పుస్తక పఠనానికి దూరమవుతున్నారని, ఆ అలవాటును తిరిగి పెంపొందించడమే గ్రంథాలయ ఉద్యమం లక్ష్యమన్నారు.
పార్కులు కేవలం వాకింగ్, వ్యాయామానికి మాత్రమే కాకుండా విజ్ఞాన కేంద్రాలుగా, చర్చా వేదికలుగా మారాలనే ఉద్దేశంతోనే పార్క్ గ్రంథాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ప్రతి ఆదివారం కుటుంబంతో కలిసి పార్కుకు వచ్చి ప్రకృతి ఒడిలో పుస్తక పఠనం చేయాలని పట్టణవాసులను కోరారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డివైఎస్వో శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
