నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు : కమిషనర్ అంబర్ కిశోర్ ఝా

నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు : కమిషనర్ అంబర్ కిశోర్ ఝా
  •      రామగుండం పోలీస్​ కమిషనర్​అంబర్ ​కిశోర్ ఝా

మంచిర్యాల, వెలుగు: నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్​ కమిషనర్ ​అంబర్ కిశోర్​ ఝా అన్నారు. 2025 క్రైమ్స్​ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సంవత్సరం కమిషనరేట్ పరిధిలో హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, అల్లర్లు, రేప్​లు, చీటింగ్, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు 2024తో పోలిస్తే గణనీయంగా తగ్గాయన్నారు. 

కిడ్నాప్​లు, తీవ్రమైన గాయాల కేసులు, సాధారణ దొంగతనాలు వంటి కొన్ని నేరాలు స్పల్పంగా పెరిగాయని చెప్పారు. నిరంతర పర్యవేక్షణ, సీసీ కెమెరాల ఏర్పాటు, పెట్రోలింగ్, వాహనాల తనిఖీలు, కమ్యూనిటీ కాంటాక్ట్, విజిబుల్​పోలీసింగ్, ప్రజలతో సమన్వయం, అవగాహన కార్యక్రమాల ద్వారా నేరాల గుర్తింపు, విచారణ వేగవంతం చేశామన్నారు. ఫలితంగా పోలీసులపై ప్రజలకు విశ్వాసం మరింత పెరిగిందన్నారు. పోలీసుల సమర్థమైన దర్యాప్తు, టెక్నాలజీ వినియోగం, పటిష్టమైన నిఘా, ఇన్ఫర్మేషన్ వ్యవస్థ వల్ల గతేడాదితో పోలిస్తే ప్రజలకు జరిగిన ఆస్తినష్టం తగ్గిందని, రికవరీ 22 శాతం పెరిగిందని తెలిపారు.

  •  ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకున్నామని సీపీ పేర్కొన్నారు. ప్రశాంతమైన, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా కృషి చేశామన్నారు.
  •  కొత్త సంవత్సరంలో శాంతిభద్రతలకు భంగం కలగకుండా, ప్రజలు నిర్భయంగా జీవించే వాతావరణం కల్పించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా నైట్​ పెట్రోలింగ్‌ మరింత పెంచి నేరాల నియంత్రణతో పాటు అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం. 
  •  మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తూ షీ- టీమ్స్, హెల్ప్ డెస్క్​లను మరింత బలోపేతం చేస్తాం. మహిళలు, యువతులు ఎలాంటి భయం లేకుండా బయటకు వెళ్లే పరిస్థితిని కల్పిస్తాం. మహిళలపై వేధింపులు, అసభ్య ప్రవర్తనకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం.
  •  ట్రాఫిక్ నియంత్రణ, యాక్సిడెంట్ల నివారణలో భాగంగా హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, డ్రంక్ అండ్​డ్రైవ్​తనిఖీలు నిర్వహిస్తాం. యాక్సిడెంట్ల వల్ల విలువైన ప్రాణాలు కోల్పోకుండా ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి. 
  •  సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ మోసాలు, ఫేక్ కాల్స్, డిజిటల్ నేరాలను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సైబర్ నేరాలపై అప్రమత్తతే ప్రధాన రక్షణ. 
  •  గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తాం. యువత భవిష్యత్తును నాశనం చేసే వాటిని ప్రజల సహకారంతో పూర్తిగా అరికడతాం. 
  •  ప్రజలు పోలీస్ శాఖతో కలిసి పనిచేసినప్పుడే శాంతియుత, సురక్షిత సమాజం సాధ్యమవుతుంది. ఏ చిన్న సమాచారం అయినా పోలీసులకు అందించాలి.