- తొమ్మిది జిల్లాల్లోని 22 రిజర్వాయర్లు నింపుతం
- హరీశ్ తప్పుడు ప్రచారం మానేసి..
- కవిత ఆరోపణలపై సమాధానం చెప్పాలన్న మంత్రి
హైదరాబాద్, వెలుగు: దేవాదుల ఎత్తిపోతల పథకం కింద 9 పంపులు 24 గంటల పాటు పూర్తి సామర్థ్యంతో నడుస్తాయని ఇరిగేషన్, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన మీడియాతో ఆయన చిట్-చాట్ చేశారు. ఇటీవల దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల బృందం నిర్వహించిన సమీక్షలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు.
గోదావరి నుంచి వీలైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసి, దేవాదుల పరిధిలోని తొమ్మిది జిల్లాలకు చెందిన 22 రిజర్వాయర్లను నింపడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అధికారులు పంపులను ఫుల్కెపాసిటీతో నడపాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయ విమర్శలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వదని స్పష్టం చేశారు.
హరీశ్ రావుపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం మానేసి, కాళేశ్వరం ప్రాజెక్టులో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొదట రూపొందించిన షీట్‌పైల్ ఫౌండేషన్ డిజైన్‌ను ఎందుకు మార్చి సీకెంట్‌పైల్ ఫౌండేషన్ అమలు చేశారో హరీశ్ రావు చెప్పాలన్నారు. ఆ నిర్ణయం వల్లే ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు ఈ పరిస్థితికి చేరుకుందన్నారు.
కాళేశ్వరం కాంట్రాక్టర్లు బీఆర్ఎస్కు రూ.1,400 కోట్లు ఇచ్చారని కవిత చేసిన ఆరోపణలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలన్నారు. దేవాదుల ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తోందని ఉత్తమ్ తెలిపారు. భూసేకరణ, అనుమతులు, నిర్మాణ పనులను వేగవంతం చేసి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. కాగా, సన్న వడ్ల కుంభకోణం అనేది అవాస్తవమన్నారు. కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ధరలు పెంచి టెండర్ కోట్ చేస్తే ఎవ్వరూ ముందుకు రాలేదని, అందుకే మళ్లీ టెండర్లను పిలిచారని ఆయన వివరించారు.
