బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషనల్ యాక్టర్గా అక్షయ్ ఖన్నా (Akshaye Khanna) వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ 'ఛావా' మూవీలో ఔరంగజేబు పాత్రలో నటించి దుమ్మురేపింది ఇతనే. ఇందులో తనదైన నటనతో అదరగొట్టేశారు. ఛావాతో క్రియేట్ చేసిన ఆ విలనిజం.. తెలుగు ఆడియన్స్లో బాగా గుర్తుండిపోయేలా చేసింది. ఇప్పుడు బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తున్న స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’లో సైతం విలన్ రోల్లో నటించి మరింత వైరల్ అయ్యాడు. ఈ క్రమంలోనే బీభత్సమైన క్రేజ్, పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ నటుడు అక్షయ్ ఖన్నా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మూవీ దృశ్యం 3. ఈ మూవీ 2026, అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో నటి శ్రియ శరణ్, రజత్ కపూర్, టబు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. అయితే, నటుడు అక్షయ్ ఖన్నా దృశ్యం 2లో భాగమైన విషయం తెలిసిందే. ఇపుడు సీక్వెల్గా తెరకెక్కుతున్న దృశ్యం3 లో కూడా అతని పాత్ర కీలకంగా మారనుంది. ఇందుకోసం అక్షయ్ ముందుగా ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ క్రమంలోనే అక్షయ్ ఖన్నా అనూహ్యంగా సినిమా నుంచి తప్పుకున్న కారణంగా, ‘దృశ్యం 3’ నిర్మాత 'కుమార్ మంగత్ పాఠక్' లీగల్ నోటీసులు పంపించారు.
ఈ సందర్భంగా నిర్మాత కుమార్ మంగత్ పాఠక్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కోసం అక్షయ్ ఖన్నాకు, తమ మధ్య ఒప్పందం జరిగింది. ఆ టైంలోనే కొంతమొత్తంలో అడ్వాన్స్ కూడా చెల్లించా. ఇప్పుడు చూస్తే అక్షయ్ ఖన్నా ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. ఈ నిర్ణయం వల్ల చిత్రబృందానికి షెడ్యూల్స్ మారడం, ప్రీ–ప్రొడక్షన్ పనులు నిలిచిపోవడం, ఆర్థిక నష్టం వాటిల్లిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు.
ముఖ్యంగా భారీ అంచనాలు, భారీ బడ్జెట్ ఫ్రాంచైజీ కావడంతో ప్లానింగ్ అంతా అక్షయ్ ఖన్నా పాత్ర చుట్టూనే జరిగిందని, ఆయన తప్పుకోవడం వల్ల పరిస్థితి క్లిష్టంగా మారిందని వెల్లడించారు. దీంతో ఒప్పంద ఉల్లంఘన (Breach of Contract) కింద అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు పంపినట్లు నిర్మాతలు తెలిపారు. అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
►ALSO READ | Prabhas: కన్నీళ్ల వెనుక కమిట్‌మెంట్.. డైరెక్టర్ మారుతికి భరోసా ఇచ్చిన ప్రభాస్..
ఇదిలా ఉండగా, అక్షయ్ ఖన్నా పాత్రకు బదులుగా జైదీప్ అహ్లావత్ ను ఎంపిక చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో షూటింగ్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వివాదంపై ఇప్పటివరకు అక్షయ్ ఖన్నా నుంచి అధికారిక స్పందన రాలేదు. ఆయన సమాధానం తర్వాతే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అక్షయ్ ఖన్నా భారీ రెమ్యూనరేషన్:
‘దురంధర్’ మూవీ సక్సెస్ తర్వాత అక్షయ్ ఖన్నా భారీగా రెమ్యూనరేషన్ పెంచేసినట్లు టాక్. అలాగే విగ్ లేకుండా నటించనంటూ కండీషన్.. డిమాండ్లను తట్టుకోలేక ‘దృశ్యం 3’ మూవీ నుంచి తప్పుకున్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ క్రమంలోనే దృశ్యం 3 నిర్మాత మంగత్ పాఠక్ కీలక కామెంట్స్ చేస్తూ.. అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు పంపారు.
‘అక్షయ్ ఖన్నాకి అస్సలు అవకాశాలు రానప్పుడు, నేను అతనితో ‘సెక్షన్ 375’ మూవీ చేశాను. ఆ తర్వాతే అతనికి గుర్తింపు వచ్చింది. ‘దృశ్యం 2’ తర్వాత అవకాశాలు పెరిగాయి. ఇప్పుడు ‘దురంధర్’ ఛాన్స్ రావడానికి కూడా నా సినిమాలు కారణం. ‘దురంధర్’ మూవీ తన వల్లే హిట్ అయ్యిందని అక్షయ్ అనుకుంటున్నాడు. కానీ అది అతని సినిమా కాదు, రణ్‌వీర్ సింగ్ వల్లే భారీ విజయం దక్కిందనే నిజాన్ని తెలుసుకోలేకపోతున్నాడు..’ అంటూ కామెంట్ చేశాడు.
మొత్తానికి, హిట్ ఫ్రాంచైజీ అయిన ‘దృశ్యం 3’ చుట్టూ ఈ లీగల్ ఇష్యూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే రోజుల్లో ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.
