ఇండియా కొడితే మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్‎తో నష్టపోయింది నిజమేనని ఒప్పుకున్న పాక్

ఇండియా కొడితే మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్‎తో నష్టపోయింది నిజమేనని ఒప్పుకున్న పాక్

ఇస్లామాబాద్: నిత్యం భారత్‎పై విషం చిమ్ముతూ, తప్పుడు ఆరోపణలతో వార్తల్లో నిలిచే పాకిస్తాన్ ఫస్ట్ టైమ్ నిజం ఒప్పుకుంది. పహల్గాం ఉగ్రవాడికి ప్రతీకారంగా ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‎లో తమ దేశానికి నష్టం వాటిల్లినట్లు పాక్ బహిరంగంగా అంగీకరించింది. ఈ మేరకు పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్‎లో భాగంగా రావల్పిండిలోని నూర్ ఖాన్ వైమానిక స్థావరంపై భారత క్షిపణులు దాడి చేశాయని.. ఈ దాడిలో ఎయిర్ బేస్ దెబ్బతినడంతో పాటు పలువురు సిబ్బంది గాయపడ్డారని అంగీకరించారు.

 ఘర్షణ సమయంలో 36 గంటల్లో ఇండియా కనీసం 80 డ్రోన్లతో దాడులకు ప్రయత్నించిందని.. అందులో 79 డ్రోన్లు కూల్చివేశామని చెప్పారు. ఒక డ్రోన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్‎పై దాడి చేసిందని ధృవీకరించారు. తమ ఎయిర్ బేస్‎పై దాడి చేయడం ద్వారా ఇండియా పెద్ద తప్పు చేసిందని నీతులు వల్లించారు. భారత దాడులను ఎప్పుడూ తిరస్కరించే పాకిస్తాన్ ఫస్ట్ టైమ్ బహిరంగంగా అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంగీకారం ఒక రకంగా ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ పరువు పొగొట్టుకున్నట్లైంది. 

జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాంలో 2025, ఏప్రిల్ 22న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన విషయం తెలిసిందే. పహల్గాంలోని పచ్చని ప్రకృతి అందాలు తిలకిద్దామని వచ్చిన పర్యాటకులపై పాక్ ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ టెర్రర్ ఎటాక్‎లో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. 

ఈ క్రమంలో ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్‎కు తగిన బుద్ధి చెప్పేందుకు ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేసేందుకు 2025, మే 10న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్‎లో భాగంగా పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ భారత సైన్యం దాడులు చేసి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది.