జయహో కాంగ్రెస్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం హవా 

 జయహో కాంగ్రెస్.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో హస్తం హవా 
  • మున్సిపోల్స్​లో ఫలించిన సంక్షేమ, అభివృద్ధి మంత్రం  
  • ఆర్మూర్, భీంగల్, బోధన్ కాంగ్రెస్​కైవసం
  • కామారెడ్డి మున్సిపాలిటీలో ఏ పార్టీకి రాని మ్యాజిక్​ ఫిగర్​  
  • బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుందలో సత్తాచాటిన కాంగ్రెస్​ 

నిజామాబాద్/కామారెడ్డి, వెలుగు : మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. అత్యధిక వార్డుల్లో విజయం సాధించి సత్తా చాటుకుంది.  కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల అభివృద్ధి మంత్రం ఫలించింది. నిజామాబాద్ జిల్లాలోని బోధన్​లో 38​, ఆర్మూర్ 36 వార్డులు, భీంగల్​లో 12 వార్డులు కలిపి 86 వార్డులకుగాను కాంగ్రెస్ 44 వార్డుల్లో సత్తాచాటింది. బీజేపీ 11 వార్డుల్లో గెలుపొందగా, బీఆర్ఎస్​14 వార్డులను కైవసం చేసుకుంది. ఎంఐఎం పార్టీ 13 వార్డుల్లో విజయం సాధించగా, ఇండిపెండెంట్లు 4 వార్డులను దక్కించుకున్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్​శ్రేణులు కీలక పాత్ర పోషించగా, రెండేళ్ల ప్రజా పాలనకు మద్దతు తెలుపుతూ జనం జైకొట్టారు.   

బీజేపీ, బీఆర్ఎస్​లు సక్సెస్ ​సాధించకపోవడంతో ఆశలు ఆవిరయ్యాయి. బోధన్​లో మజ్లిస్​ ప్రభావం చాటుకుంటుంది.  కామారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లోని 92 వార్డులకుగాను కాంగ్రెస్ 50,  బీజేపీ 19, బీఆర్ఎస్​ 17,  ఎంఐఎం 1,  ఇండిపెండెంట్లు 5 గెలిచారు.  కామారెడ్డి మున్సిపాలిటీలో కాంగ్రెస్​కు  అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ మ్యాజిక్​ ఫిగర్​ చేరుకోలేదు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుందల్లో కాంగ్రెస్​  హవా సాగింది. ఇక్కడ చైర్​పర్సన్​​, వైస్​ చైర్​పర్సన్ పదవులను దక్కించుకునేందుకు ఇండిపెండెంట్లు కీలకంగా మారారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీల్లో చైర్​పర్సన్, వైస్​ చైర్​పర్సన్ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్​కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది.    

చక్రం తిప్పిన టీపీసీసీ చీఫ్..

టీపీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్ సొంత మండలం భీంగల్​లో చక్రం తిప్పారు. రెండు రోజుల ముందు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్​పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దీంతో ప్రజాపాలనకు జనం జైకొట్టారు.  ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి భీంగల్ మున్సిపాలిటీని సవాల్​గా తీసుకున్నా సక్సెస్​ కాలేకపోయారు. బీఆర్​ఎస్ నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఆర్మూర్​ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరేయడానికి ఎమ్మెల్యే పైడి రాకేశ్​​రెడ్డి సర్వశక్తులు ఒడ్డినా 8 చోట్ల మాత్రమే గెలుపు సాధించగలిగారు. 19 స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్​ మ్యాజిక్​ ఫిగర్​ సొంతం చేసుకుంది. రెబెల్స్​ పోటీలో లేకుంటే మరో మూడు వార్డులు కాంగ్రెస్​కు దక్కేవి. బీఆర్​ఎస్​ 5  స్థానాలు, మజ్లిస్​ ఒక చోట గెలువగా ఇండిపెండెంట్​లుగా పోటీ చేసిన ముగ్గురు రెబెల్స్​ విజయం సాధించారు. 

బోధన్​లో..

38 వార్డులున్న బోధన్​ మున్సిపాలిటీలో కాంగ్రెస్ 17 వార్డులు కైవసం చేసుకుంది.  రెబెల్స్​తో కొన్ని వార్డుల్లో పార్టీకి నష్టం వాటిల్లింది. మజ్లిస్ గత వైభవాన్ని చాటుతూ 12 స్థానాలు గెలుచుకోగా, బీజేపీ 3 వార్డులకే పరిమితమైంది. బీఆర్​ఎస్​ ఐదు వార్డులు గెలువగా కాంగ్రెస్​ రెబెల్ ఒకచోట విజయం  సాధించారు.  
బాన్సువాడ, ఎల్లారెడ్డి, 

బిచ్​కుంద కాంగ్రెస్​కైవసం...  

బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్​కు స్పష్టమైన మెజార్టీ వచ్చింది. బాన్సువాడలో  19 వార్డులకుగాను 11 , ఎల్లారెడ్డి వార్డులకు 10, బిచ్​కుందలో 12 వార్డులకు 10 వార్డులను కాంగ్రెస్​ కైవసం చేసుకుంది. దీంతో మూడు మున్సిపాలిటీల్లోని చైర్​పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​లు హస్తగతం కానున్నాయి.

 కామారెడ్డిలో విలక్షణ తీర్పు.. ​ 

 కామారెడ్డి మున్సిసాలిటీల్లో ఓటర్లు విలక్షణ తీర్పు ఇచ్చారు.  మ్యాజిక్​ ఫిగర్​ చేరుకునేందుకు ఏ పార్టీకి  స్పష్టమైన మెజార్టీ రాలేదు.  చైర్మన్​ పదవిని దక్కించుకునేందుకు ఆయా పార్టీలకు ఇండిపెండెంట్లు,  ఎక్స్​అఫీషియో సభ్యులు కీలకం కానున్నారు. ఒకే పార్టీ చైర్మన్​, వైస్​ చైర్మన్​ పదవులను దక్కించుకోలేని పరిస్థితి ఏర్పడింది.  మ్యాజిక్​ ఫిగర్​ చేరుకోవాలంటే 25 సీట్లు  రావాలి.  కాంగ్రెస్​కు 19 వార్డులతోపాటు ఎక్స్​ఆఫిషియో మెంబర్ జహీరాబాద్​ ఎంపీ ఉన్నారు.  బీజేపీ దక్కించుకోవాలనుకున్న  ఇండిపెండెంట్లు 3, ఎక్స్​అఫిషియో సభ్యుల సహకారం తీసుకున్నా మ్యాజిక్​ ఫిగర్​ చేరదు. స్థానిక ఎమ్మెల్యేతో పాటు, ఇద్దరు ఎమ్మెల్సీల సహకారం తీసుకున్న ఇంకా ముగ్గురు సభ్యులు కావాలి. 3 సీట్లు వచ్చిన ఇండిపెండెంట్లు,  11 సీట్లు వచ్చిన బీఆర్​ఎస్ కీలక పాత్ర పోషించనున్నాయి.   

నిజామాబాద్​ జిల్లాలోని మున్సిపాలిటీల విజేతలు..

మున్సిపాలిటీ    కాంగ్రెస్    బీజేపీ    బీఆర్​ఎస్    ఎంఐఎం    ఇండిపెండెంట్స్

ఆర్మూర్    19    08    05    01    03

బోధన్    17    03    05    12    01

భీంగల్    08    0    04    0    0

కామారెడ్డి జిల్లాలో మున్సిపాలిటీల విజేతలు..

మున్సిపాలిటీ    కాంగ్రెస్    బీజేపీ    బీఆర్​ఎస్    ఎంఐఎం     ఇండిపెండెంట్స్

కామారెడ్డి    19    16    11    0    03

బాన్సువాడ    11    03    03    01    01

ఎల్లారెడ్డి    10    0    01    0    01

బిచ్​కుంద    10    0    02    0    0