బీసీలకు బీఆర్ఎస్, మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీలకు బీఆర్ఎస్, మల్లారెడ్డి క్షమాపణ చెప్పాలి : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన బుట్టంగారి మాధవరెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి పాలవడం మంచి పరిణామమని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయనను గెలిపించాలని ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రి మల్లారెడ్డి వెంటనే బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల ఉసురు తగిలే మాధవరెడ్డి  ఓటమి పాలయ్యారని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

బీసీల నోటికాడు ముద్దను గుంజుకుని, తినే కంచంలో మన్ను పోసిన బీసీ ద్రోహి మాధవరెడ్డి అని మండిపడ్డారు. ఆయనను ఓటు ఆయుధంతో ఓడించాలని తాము ఇచ్చిన పిలుపును ప్రజలు గౌరవించారని ప్రశంసించారు. 

మేడ్చల్ జిల్లా  మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ కేశవాపూర్ వార్డులో తరఫున పోటీ చేసిన మాధవరెడ్డికి.. బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు మద్దతు ఇచ్చే అగ్రకుల ప్రజాస్వామ్యవాదులు ఒక్కటై తగిన శాస్తి చేశారని తెలిపారు. మాధవరెడ్డి తరఫున ప్రచారం చేసిన మల్లారెడ్డి ఇప్పటికైనా బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని..లేకుంటే బీసీ సమాజం ముందు ఆయనను దోషులుగా నిలబెడతామని హెచ్చరించారు.