20 ఏళ్లు దాటాయా..? ప్రతీ ఆరు నెలలకొకసారి కిడ్నీ టెస్ట్ తప్పనిసరి.. హెల్తీగా ఉన్నా సరే..

20 ఏళ్లు దాటాయా..? ప్రతీ ఆరు నెలలకొకసారి కిడ్నీ టెస్ట్ తప్పనిసరి.. హెల్తీగా ఉన్నా సరే..

20 ఏళ్లు పైబడిన ప్రతి భారతీయుడు ప్రతి ఆరు నెలలకు ఒకసారి కిడ్నీ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ కోరుతోంది. ఎందుకంటే.. కిడ్నీ వ్యాధికి సంబంధించి లక్షణాలు అంత తొందరగా బయటపడవని, లక్షణాలు కనిపించే సమయానికి జరగరాని నష్టం జరిగిపోతుందని.. అందుకే ఆరోగ్యవంతులు కూడా కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని పార్లమెంటరీ ప్యానెల్ తెలిపింది.

సీరం క్రియాటినిన్ పరీక్ష సరిపోదని, కిడ్నీలు దాదాపు దెబ్బ తినేంత వరకూ ఈ టెస్ట్లో రిజల్ట్ పాజిటివ్ అనే చూపిస్తుందని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటరీ కమిటీ వివరించింది. క్రియాటిన్ ఒక్కటే సరిపోదని, eGFR, యూరిన్ ఆల్బుమిన్ పరీక్షలు కూడా తప్పనిసరిగా చేయించుకోవాలని.. ఈ మేరకు దేశ పౌరులకు ఈ పరీక్షలు తప్పనిసరి చేయాలని కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సూచించింది.

మన దేశ యువతలో అధిక రక్తపోటు, నొప్పి నివారణ మందుల వాడకం పెరిగిందని.. క్రియాటినిన్‌తో పాటు eGFR, యూరిన్ ఆల్బుమిన్ పరీక్షలు కూడా చేయించుకోవాలని సూచించింది. మూత్రపిండాల వ్యాధికి కారణాలను అధ్యయనం చేయాలని కేంద్ర మంత్రిత్వ శాఖలు, పరిశోధనా సంస్థలను పార్లమెంటరీ కమిటీ కోరింది. ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉచిత డయాలసిస్, కిడ్నీ వ్యాధులపై ఆయుర్వేదపరంగా పరిశోధనను కమిటీ సిఫార్సు చేసింది.

కిడ్నీ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. చిన్న వయసులోనే కిడ్నీ వ్యాధులు వస్తున్నాయి. లక్షలాది మంది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం నుంచి క్రానిక్​ డిసీజ్​ వరకు వివిధ సమస్యలతో బాధపడుతున్నారు. బీపీ, హైపర్‌‌‌‌  టెన్షన్‌‌, డయాబెటిస్, ఊబకాయం, ఆహారపు అలవాట్లు, పెయిన్ కిల్లర్లను ఎక్కువగా వినియోగించడం వంటివి దీనికి కారణమవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు.

ప్రతి వందలో ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ఏదో  ఒక స్థాయిలో కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్టు సర్వేలు చెబుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధుల తర్వాత జనం ఎక్కువగా కిడ్నీ జబ్బులతోనే ఇబ్బందిపడుతున్నారు. ప్రధానంగా ఇటీవలి కాలంలో యూత్​లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం కిడ్నీ బాధితులు ప్రతి వంద మందిలో 30 శాతం మంది 35 ఏండ్లలోపు వారే.

కిడ్నీ జబ్బుల పట్ల అవగాహన లేకపోవడంతో మూడో, నాలుగో స్టేజ్​ దాకా కూడా సమస్యను గుర్తించలేకపోతున్నారని.. చాలా మంది పేషెంట్లు కిడ్నీలు పాడైపోతున్న దశలోనే తమ వద్దకు వస్తున్నారని నెఫ్రాలజిస్టులు చెప్తున్నారు.

చిన్న వయసులో బీపీ వచ్చిందంటే, దాదాపు కిడ్నీ సమస్యగానే భావించాలని.. కానీ ట్యాబ్లెట్లు వాడుతూ సమస్య తీవ్రమయ్యే వరకూ తెచ్చుకుంటున్నారని స్పష్టం చేస్తున్నారు. కిడ్నీ జబ్బులకు ఇబ్బందికర లక్షణాలు ఎక్కువగా ఉండవని, దాంతో పరిస్థితి ముదిరే స్టేజీలో ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు.