ఆధునిక సాంకేతిక ప్రపంచంలో కృత్రిమ మేధ వేగంగా విస్తరిస్తోంది. జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఆరోగ్య సంరక్షణ, వ్యాధి నిర్ధారణ, రిటైల్, ఫైనాన్స్, పరిశ్రమలు వంటి అనేక రంగాల్లో ఏఐ విప్లవాత్మక మార్పులకు దారి తీస్తోంది. అయితే ఈ వేగంలో భారత్ క్రియాశీలంగా ఉన్నప్పటికీ, గ్లోబల్ పోటీలో ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేకపోతోంది. పెట్టుబడుల కొరత, మౌలిక వసతుల లేమి, నిపుణ మానవ వనరుల లోపం వంటి అంశాలు దేశీయ ఏఐ వృద్ధికి ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి. స్టాన్ఫోర్డ్ విడుదల చేసిన తాజా ఏఐ నివేదిక ప్రకారం..2013–2024 మధ్య కాలంలో కృత్రిమ మేధ రంగంలో అమెరికా సుమారు 47 వేల కోట్ల డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించగా, చైనా దాదాపు 12 వేల కోట్ల డాలర్లు సమీకరించింది. అదే సమయంలో భారత్ కేవలం 1,100 కోట్ల డాలర్ల పెట్టుబడులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రపంచంలో డేటా ఉత్పత్తిలో భారత్ వాటా సుమారు 20 శాతం ఉన్నప్పటికీ, డేటా నిల్వ సామర్థ్యం కేవలం 3 శాతానికి పరిమితమవుతుండటం గమనార్హం. ఈ అసమతుల్యత ఏఐ ఆధారిత పరిశోధనలు, ఉత్పత్తుల అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఏఐ మోడళ్ల శిక్షణకు కీలకమైన జీపీయూలు
అందుబాటులో లేకపోవడం భారత్‌కు పెద్ద సమస్యగా మారింది. తాజా ఆర్థిక సర్వే కూడా ఇదే అంశంపై హెచ్చరించింది. జీపీయూల కొరత కారణంగా పరిశోధనల వేగం మందగించడం, ఖర్చులు పెరగడం జరుగుతోంది. మరోవైపు సెమీకండక్టర్ చిప్‌ల కోసం విదేశాలపై ఆధారపడటం దేశీయ ఏఐ ఎకో సిస్టమ్‌ను మరింత బలహీనపరుస్తోంది. దేశీయంగా నిధులు, మౌలిక వసతులు, మార్కెట్ యాక్సెస్ సరిగా లభించకపోవడంతో భారతీయ ఏఐ స్టార్టప్‌లు అమెరికా వైపు చూస్తున్నాయి.
ఇన్నోవేషన్ డ్రెయిన్
వందకు పైగా ఏఐ సంస్థలు ఇప్పటికే యూఎస్‌కు తరలివెళ్లడం, అక్కడ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నించడం భారత్‌కు హెచ్చరికగా భావించాలి. ఇది ‘బ్రెయిన్ డ్రెయిన్’ మాత్రమే కాదు, ‘ఇన్నోవేషన్ డ్రెయిన్’ కూడా. అంచనాల ప్రకారం వచ్చే ఏడాది కల్లా భారత్‌లో ఏఐ రంగంలో 23 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఉన్నత విద్యావ్యవస్థను తక్షణమే సంస్కరించుకోకపోతే దాదాపు 10 లక్షల ఏఐ ఉద్యోగాలు నిపుణుల లేమితో ఖాళీగానే మిగిలిపోతాయని విశ్లేషణలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏఐ కోర్సులు కొద్ది అగ్రశ్రేణి విద్యాసంస్థలకే పరిమితమయ్యాయి. అధికశాతం ఇంజినీరింగ్, సైన్స్ కళాశాలల్లో ఏఐ విభాగాలు, ప్రాక్టికల్ ఓరియెంటెడ్ పాఠ్యప్రణాళికలు లేవు. ఈ పరిస్థితుల్లో దేశీయంగా ఆధునిక మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయడం అత్యవసరం. ఏఐ మిషన్ కింద భారీ స్థాయిలో జీపీయూలను అందుబాటులోకి తీసుకురావాలి. విశాఖపట్నంలో గూగుల్ ఏఐ హబ్, డేటా సెంటర్, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు వంటి ప్రణాళికలు మౌలిక వసతుల పరంగా సానుకూల సంకేతాలే. అయితే, ఇవి కేవలం ప్రారంభ దశకే పరిమితం కాకుండా,
దేశవ్యాప్తంగా విస్తరించాలి.
స్వదేశీ ఏఐ మోడళ్ల అభివృద్ధి
తాజా అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్న మరో కీలక అంశం స్వదేశీ ఏఐ మోడళ్ల అభివృద్ధి. విదేశీ మోడళ్లపై ఆధారపడటం డేటా భద్రత, వ్యయభారం, వ్యూహాత్మక స్వతంత్రతపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇండియా తన భాషలు, అవసరాలు, సామాజిక వాస్తవాలకు అనుగుణంగా సొంత లాంగ్వేజ్ మోడళ్లు, అప్లికేషన్లు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాకుండా, దేశాల ఆర్థిక భద్రత, జాతీయ భద్రత, సామాజిక సమానత్వానికి కేంద్ర బిందువుగా మారుతోంది. అమెరికా, చైనా వంటి దేశాలు ఏఐని ‘స్ట్రాటజిక్ నేషనల్ అసెట్’గా పరిగణిస్తూ భారీ ప్రభుత్వ–ప్రైవేట్ పెట్టుబడులతో ముందుకెళ్తున్నాయి. భారత్ కూడా ఈ మార్గంలో అడుగులు వేస్తున్నప్పటికీ, అవి ఇంకా చెల్లాచెదురుగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం, అమెరికాలో మొత్తం ఏఐ పెట్టుబడుల్లో ప్రభుత్వ వాటా 30 శాతం దాటింది. చైనాలో అయితే ఇది ఇంకా ఎక్కువ. భారత్‌లో మాత్రం ఏఐ పెట్టుబడులు ఎక్కువగా ప్రైవేట్ రంగానికే పరిమితమవుతున్నాయి. దీని ఫలితంగా దీర్ఘకాలిక పరిశోధనలు, ఫౌండేషన్ మోడళ్ల అభివృద్ధి వంటి ఖరీదైన కార్యక్రమాలకు అవసరమైన స్థిర నిధులు అందడం లేదు. ప్రభుత్వం ముందుగా తీసుకోవాల్సిన కీలక నిర్ణయం జాతీయ ఏఐ ఫండింగ్ మోడల్ రక్షణ, అంతరిక్ష రంగాల మాదిరిగానే ఏఐకూ ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలి.
నేషనల్ ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి
ఏఐ పరిశోధనల కోసం ఐఐటీలు, ఐఐఎస్సీ, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ‘నేషనల్ ఏఐ ల్యాబ్స్’ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కేవలం అకడమిక్ పరిశోధనకే కాకుండా, స్టార్టప్‌లకు ఓపెన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌గా పనిచేయాలి. మరో కీలక అంశం డేటా పాలసీ. ప్రపంచ డేటాలో ఐదవ వంతు భారత్ నుంచి ఉత్పత్తి అవుతున్నప్పటికీ, ఆ డేటా ఆధారంగా విలువ సృష్టించుకుంటున్నవి ఎక్కువగా విదేశీ సంస్థలే. దేశీయంగా సురక్షితమైన డేటా షేరింగ్ ఫ్రేమ్‌వర్క్, పబ్లిక్ డేటా రిపోజిటరీలు ఏర్పాటు చేస్తే హెల్త్‌టెక్, అగ్రిటెక్, ఎడ్యుటెక్ రంగాల్లో దేశీయ ఏఐ మోడళ్ల అభివృద్ధికి ఊతం లభిస్తుంది. విద్యారంగంలో సంస్కరణలు మరింత అత్యవసరం. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌ను ఎలక్టివ్‌లుగా కాకుండా కోర్ సబ్జెక్టులుగా ప్రవేశపెట్టాలి. పరిశ్రమలతో కలిసి ‘లై వ్ ప్రాజెక్ట్స్, అప్రెంటిస్‌షిప్స్’ తప్పనిసరి చేస్తేనే నైపుణ్య లోపం తగ్గుతుంది. ప్రపంచ బ్యాంక్ అంచనాల ప్రకారం.. సరైన స్కిల్ అప్‌గ్రేడేషన్ జరిగితే భారత్ ఏఐ ద్వారా జీడీపీకి అదనంగా 7–8 శాతం వృద్ధిని సాధించగలదు.
ప్రవాస భారతీయ ఏఐ నిపుణులను తిరిగి రప్పించేలా ప్రత్యేక ప్రోత్సాహక విధానాలు అవసరం. పన్ను రాయితీలు, రీసెర్చ్ గ్రాంట్లు, స్టార్టప్ ఫ్రీడమ్ కల్పిస్తే భారత్ బ్రెయిన్ డ్రెయిన్‌ను బ్రెయిన్ గెయిన్‌గా మార్చగలదు. ఏఐ యుగంలో వెనకబడితే, అది కేవలం ఒక టెక్నాలజీ లోటు కాదు - భవిష్యత్ అవకాశాలు కోల్పోవడమే. కాబట్టి ఇప్పుడే సమగ్ర జాతీయ వ్యూహంతో ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది. ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, బలమైన మౌలిక వసతులు, సమగ్ర విద్యా సంస్కరణలు, పరిశోధనలకు ప్రోత్సాహం కలిసొస్తే - ఏఐ పందెంలో అగ్రదేశాలకు దీటుగా భారత్ దూసుకుపోవడం అసాధ్యం కాదు.
- సిద్ధగౌని సుదర్శన్,
సీనియర్ జర్నలిస్ట్
