- బీఆర్‍ఎస్ ఖాతాలో తొర్రూర్
- అనుకున్న స్థాయిలో ప్రభావం చూపని బీజేపీ
- హంగ్ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్లు, కమ్యూనిస్ట్‌లకు డిమాండ్
వరంగల్/నెట్‍వర్క్, వెలుగు: ఓరుగల్లు మున్సిపోల్స్‌లో హస్తం పార్టీ హవా చూపింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉండగా, 7 స్థానాల్లో అధికార కాంగ్రెస్ మున్సిపల్ చైర్‌పర్సన్‌కు అవసరమైన క్లియర్ మెజార్టీ దక్కించుకుంది. విపక్ష బీఆర్‍ఎస్ ఒక చోట విజయం సాధించగా, బీజేపీ పోటీ ఇవ్వలేదు. మరో 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ క్రమంలో ఎక్కువ సీట్లు సాధించిన కాంగ్రెస్, బీఆర్‍ఎస్ వంటి ప్రధాన పార్టీలకు ఇండిపెండెంట్ విజేతలతో పాటు బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీల నుంచి గెలిచినవారి మద్దతు తప్పనిసరి అయ్యింది.
దీంతో ప్రధాన పార్టీలు మున్సిపల్పీఠం దక్కించుకోడానికి క్యాంపు రాజకీయాలకు తెరలేపారు. ఉమ్మడి జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో 260 వార్డులు ఉండగా, కాంగ్రెస్ 140 వార్డులో విజయం సాధించగా, బీఆర్‍ఎస్ 88 స్థానాలను దక్కించుకున్నది. బీజేపీ 8, సీపీఎం 5, సీపీఐ 4, ఇండిపెండెంట్లు 15 వార్డుల్లో గెలుపొందారు. కాగా, 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఓరుగల్లులో 9 మున్సిపాలిటీలు ఉండగా, అన్నిచోట్ల బీఆర్‍ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మరో 3 స్థానాలు పెరిగి 12 మున్సిపాలిటీలు ఉన్నా, కేవలం తొర్రూర్ లో మాత్రమే విజయం సాధించగలిగింది.
చైర్పర్సన్ పీఠం కోసం పోటీ..
నర్సంపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా పెండెం శ్రీలక్ష్మి రామానంద్ వినిపిస్తోంది. పరకాలలో పావుశెట్టి సునీల్‌కుమార్, భూపాలపల్లిలో బుర్ర కొమ్రయ్యగౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. ములుగులో నల్లెల స్వాతిభరత్, చింతనిప్పుల చంద్రకళ మధ్య చైర్పర్సన్ పీఠం కోసం పోటీ నెలకొన్నది. తొర్రూరులో కర్నే నాగరాజు, చకిలేల అలివేణి మధ్య పోటీ ఉండగా, మరిపెడలో కాలం సునీతారెడ్డి, వీసారపు ప్రగతి పోటీలో ఉన్నారు. డోర్నకల్‌లో ఎల్లావుల సువర్ణ, రాజకుమారి పోటీ పడుతుండగా, మహబూబాబాద్‌లో గుగులోత్ జ్యోతి, బోడ రవికుమార్ చైర్పర్సన్పదవికి పోటీలో ఉన్నారు. మిగతా చోట్ల హంగ్ ఏర్పడడంతో చైర్ పర్సన్ పీఠం ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొన్నది.
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల వారీగా వివరాలు..
మున్సిపాలిటీ(వార్డులు) కాంగ్రెస్ బీఆర్‍ఎస్ బీజేపీ సీపీఎం సీపీఐ ఇండిపెండెంట్లు
నర్సంపేట(30) 21 06 01 01 _ 01
వర్ధన్నపేట(12) 05 06 _ _ _ 01
పరకాల (22) 13 06 03 _ _ _
భూపాలపల్లి(30) 16 10 02 _ 01 01
ములుగు(20) 12 05 01 _ _ 02
జనగామ(30) 12 13 _ 01 _ 04
స్టేషన్‍ఘనపూర్(18) 13 05 _ _ _ _
తొర్రూర్(16) 07 09 _ _ _ _
మరిపెడ(15) 09 05 _ _ _ 01
డోర్నకల్(15) 11 04 _ _ _ _
కేసముద్రం(16) 08 08 _ _ _ _
మహబూబాబాద్(36) 13 11 01 03 03 05
