కార్పొరేషన్ల పై కాంగ్రెస్ జెండా...రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, మంచిర్యాల హస్తగతం

కార్పొరేషన్ల పై కాంగ్రెస్ జెండా...రామగుండం, నల్గొండ, మహబూబ్నగర్, మంచిర్యాల హస్తగతం
  •     కొత్తగూడెంలో హంగ్​.. కాంగ్రెస్​, సీపీఐకి చెరో 22 సీట్లు
  •     కరీంనగర్​, నిజామాబాద్‌లో అతి పెద్ద పార్టీగా బీజేపీ
  •     ఇండిపెండెంట్ల మద్దతుతో కమలం ఖాతాలో కరీంనగర్​
  •     ఏమాత్రం ప్రభావం చూపని బీఆర్ఎస్​
  •     ఇందూరులో ఉత్కంఠ రేపుతున్న పరిణామాలు 
  •     ఇక్కడ ఎక్స్​అఫీషియో ఓట్లు కలిపినా సమానమే
  •     కీలకం కానున్న బీఆర్‌‌ఎస్​ కార్పొరేటర్​ ఓటు

హైదరాబాద్​, వెలుగు:  ఏడు కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్​ విజయ భేరీ మోగించింది. రామగుండం, నల్గొండ, మహబూబ్​నగర్​, మంచిర్యాలను పూర్తిమెజారిటీతో కైవసం చేసుకున్నది. కొత్తగూడెంలో హంగ్ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్​, సీపీఐ చెరో 22 సీట్లతో పెద్దపార్టీలుగా అవతరించాయి. స్థానిక సీపీఐ ఎమ్మెల్యే కూనంనేనికి సీఎం రేవంత్​ ఫోన్​చేసి మేయర్​ సీటు ఆఫర్​ ఇవ్వడంతో ఇది కూడా కాంగ్రెస్​ మిత్రపక్షం ఖాతాలో చేరనుంది. ఇక కరీంనగర్​, నిజామాబాద్​కార్పొరేషన్లలో బీజేపీ సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరించింది.  

కరీంనగర్‌‌లో 30 సీట్లు గెలుచుకున్న కమలం పార్టీ ఇండిపెండెంట్ల మద్దతుతో ఇప్పటికే మ్యాజిక్​ ఫిగర్​(34)కు దగ్గరైంది. కానీ నిజామాబాద్​ కార్పొరేషన్‌లో ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. ఇక్కడ బీజేపీ కి 28 సీట్లు రాగా.. కాంగ్రెస్ 17,  ఎంఐఎం పార్టీ 14 సీట్లు గెలుచుకున్నాయి. బీఆర్‌‌ఎస్​  ఒక  స్థానానికే పరిమితం కావడంతో ఇక్కడ ఎక్స్​అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో ఈ నెల 16న జరిగే మేయర్​ ఎన్నికల్లో ఏ పార్టీ గెలవనుందోననే ఉత్కంఠ నెలకొన్నది.

నాలుగు చోట్ల కాంగ్రెస్​ విజయఢంకా.. 

రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించగా, ప్రధాన పార్టీలన్నీ కార్పొరేషన్లపైనే  దృష్టి సారించాయి. సీఎం రేవంత్​రెడ్డిసహా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రి బండి సంజయ్​, ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కార్పొరేషన్లలో హోరాహోరీగా పోరాడారు. బీజేపీ ఏకంగా జాతీయ అధ్యక్షుడు నితిన్​ నబీన్‌తో మహబూబ్‌నగర్​ కార్పొరేషన్​ పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభింపజేసింది. 

కాంగ్రెస్​ పార్టీకి చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కొత్తగూడెం, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్గొండ కార్పొరేషన్​పై పూర్తిగా దృష్టి సారించారు.  ఈ క్రమంలో రామగుండం, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్​నగర్​మున్సిపాలిటీలను పూర్తి మెజారిటీతో హస్తం పార్టీ కైవసం చేసుకున్నది. మొత్తంమీద కార్పొరేషన్ల పరిధిలోని 414 సీట్లకుగానూ 190 చోట్ల కాంగ్రెస్​, 76 బీజేపీ, 63 మంది బీఆర్‌‌ఎస్​  అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలిచారు. 

ఉత్కంఠ రేపుతున్న నిజామాబాద్​..

మున్సిపల్​ ఎన్నికల్లో నిజామాబాద్​ ఫలితాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.  ఇక్కడ 60 సీట్లు ఉండగా 28 చోట్ల  గెలిచిన బీజేపీ సింగిల్​ లార్జెస్ట్​ పార్టీగా అవతరించింది. కానీ మేయర్​ సీటు దక్కించుకోవాలంటే 31 ఓట్లు అవసరం.  ఇక్కడ కాంగ్రెస్​ 17, ఎంఐఎం 14 చోట్ల గెలవగా బీఆర్‌‌ఎస్​ అభ్యర్థి ఒకరు గెలిచారు. ఈనెల 16న జరిగే మేయర్​ ఎన్నికల్లో ఎక్స్అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి.  బీజేపీకి ఎక్స్​అఫీషియో సభ్యులుగా ఎంపీ అర్వింద్, నిజామాబాద్​ అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యానారాయణ. ఆర్మూర్​ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి ఉన్నారు. 

బీజేపీ ఎమ్మెల్సీలుగా కొమురయ్య, అంజిరెడ్డి ఉన్నారు.  వీరంతా నిజామాబాద్​ కార్పొరేషన్‌లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు నమోదు చేసుకుంటే బీజేపీ బలం 33కు పెరుగుతుంది. ఇక కాంగ్రెస్​ నుంచి గెలిచిన కార్పొరేటర్లు 17 మంది ఉన్నారు. మజ్లిస్​ పార్టీ పక్షాన గెలిచిన 14 మంది సపోర్ట్​ తీసుకుంటే ఈ పార్టీకి ఇద్దరు ఎక్స్​ అఫీషియో సభ్యులుగా  పీసీసీ చీఫ్,​ ఎమ్మెల్సీ మహేశ్‌​కుమార్​గౌడ్​, నిజామాబాద్​ రూరల్​ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతిరెడ్డి ఓట్లు ఉన్నాయి. వీటిని కలిపితే కాంగ్రెస్​, ఎంఐఎంకు కలిపి 33 ఓట్లు వస్తున్నాయి. దీంతో ఇక్కడ గెలిచిన ఏకైక బీఆర్ఎస్​ కార్పొరేటర్​ ఓటు కీలకం కాబోతున్నది. 

బీజేపీ ఖాతాలోకి కరీంనగర్​..

కరీంనగర్‌‌లో 30 డివిజన్లలో గెలిచిన బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది.  కాంగ్రెస్​ 14 చోట్ల గెలిచి రెండో స్థానంలో నిలిచింది. గత ఎన్నికల్లో 33  స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్  ఈ సారి 9 స్థానాలకు,  గత ఎన్నికల్లో ఆరు చోట్ల గెలిచిన ఎంఐఎం, ఈసారి మూడు స్థానాలకే పరిమితమ య్యాయి. ఆలిండియా  ఫార్వర్డ్ బ్లాక్ నుంచి ఈసారి ఇద్దరు కార్పొరేటర్లు గెలిచారు. మేయర్​పీఠం దక్కించుకోవాలంటే బీజేపీకి  మరో నలుగురు కార్పొరేటర్ల అవసరమయ్యారు. 

కాగా, శుక్రవారం రాత్రి  13వ డివిజన్ ఇండిపెండెంట్ అభ్యర్థినిగా విజయం సాధించిన  తెల్ల లక్ష్మి, 15 డివిజన్ ఏఐఎఫ్ బీ అభ్యర్థినిగా విజయం సాధించిన విపల సాయి జ్యోతి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీలో  చేరారు. దీంతో బీజేపీ బలం 32కు చేరింది. మరో 8 మంది ఇండిపెండెంట్లు బీజేపీ నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలిసింది. వారు నేడో, రేపో బీజేపీ కండువా కప్పుకునే అవకాశముంది. దీంతో తమకు ఎక్స్ అఫీషియో ఓటు అవసరం రాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయం వెల్లడించింది.