- నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 46 రోజుల పాటు నిర్వహణ: మంత్రి శ్రీధర్ బాబు
- వివిధ రాష్ట్రాలకు చెందిన 1,050 స్టాళ్ల ఏర్పాటు
- పెద్దలకు ఎంట్రీ ఫీజు రూ.50, ఐదేండ్ల లోపు పిల్లలకు ఉచితం
- డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి వెంకట్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
బషీర్‌బాగ్, వెలుగు: ఏటా హైదరాబాద్‌లో నిర్వహించే నుమాయిష్ తెలంగాణ సంస్కృతి, గౌరవానికి ప్రతీకగా దేశ, విదేశాల్లో నిలుస్తుందని ఐటీ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు శ్రీధర్ బాబు అన్నారు. దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ 85వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) జనవరి 1న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గాంధీ సెంటనరీ హాలులో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సుఖేశ్ రెడ్డి, కార్యదర్శి బీఎన్ రాజేశ్వర్, సంయుక్త కార్యదర్శి చంద్రశేఖర్, కోశాధికారి సంజీవ కుమార్, పబ్లిసిటీ కన్వీనర్ సురేశ్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.
జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు జరిగే నుమాయిష్ నిర్వహణ కోసం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 34 సబ్ కమిటీలు నిరంతరం పని చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు తమవంతు సహకారాన్ని అందజేస్తున్నాయని వివరించారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాళ్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల స్టాళ్లను నుమాయిష్‌లో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 వరకు, వీకెండ్, హాలిడేస్‌లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ తెరిచి ఉంటుందన్నారు. ఎంట్రీ ఫీజు రూ.50 కాగా, ఐదేండ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
1,050 స్టాళ్లు..
మొత్తం 1,050 స్టాళ్లతో కొలువుతీరుతున్న నుమాయిష్‌లో మహిళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్టాళ్లను కేటాయించామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. నుమాయిష్‌కు వచ్చే సందర్శకుల కోసం మెట్రో రైలు సేవలను కూడా విస్తరిస్తున్నామని, ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను కూడా నడపనున్నట్లు వెల్లడించారు. కార్లు, బైక్స్ కోసం ఉచిత పార్కింగ్ వసతిని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ కోర్టులు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యా సంస్థలను నిర్వహిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. నూమాయిష్ ప్రాంగణంలో మొత్తం 120 సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 24 గంటల పాటు అంబులెన్సులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు లక్షా 50 వేల లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు భారీ సంపులు, 82 హైడ్రాంట్లు ఏర్పాటు చేశామని చెప్పారు. రెండు ఫైరింజిన్లు ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంచుతామని తెలిపారు.
