జనగామ అర్బన్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మికులకు నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కాసు మాధవి డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు రాపర్తి రాజు అధ్యక్షతన స్థానిక సీఐటీయూ జిల్లా ఆఫీస్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాసు మాధవి మాట్లాడుతూ కార్పొరేట్యాజమాన్యాల ప్రయోజనాల కోసం సంపద సృష్టి కర్తలైన కార్మిక వర్గాన్ని ఆధునిక బానిసలుగా మార్చే కుట్రలో భాగంగానే నాలుగు లేబర్ కోడ్ ల అమలు కోసం నవంబర్ 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేశారని విమర్శించారు.
ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చుతూ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీ జి రామ్ జి పేరుతో మార్పు చేశారన్నారు. జనవరి 19న జరిగే కార్మిక కర్షక ఐక్యత ర్యాలీ లో కార్మికులు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సుంచు విజేందర్, అన్నబోయిన రాజు, బూడిద ప్రశాంత్, చందర్, పొదల నాగరాజు, కట్టగల్ల వెంకటేశ్, కుమారస్వామి, రాజు, రమ, తార, మంగ, మునీర్, జ్యోతి సుమతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.
