విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : డీఈవో రంగయ్య నాయుడు

విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించాలి : డీఈవో రంగయ్య నాయుడు

వర్ధన్నపేట, వెలుగు: ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని వరంగల్ డీఈవో రంగయ్య నాయుడు అన్నారు. వరంగల్​జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద కస్తూర్భా గాంధీ పాఠశాలలో ఆదివారం పీఎం పోషణ్ మధ్యాహ్న భోజన పథకం వంట కార్మికులకు జిల్లాస్థాయి వంటల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వంట కార్మికులకు నగదు బహుమతులు డీఈవో అందజేశారు. 

అనంతరం వర్ధన్నపేట ఎంఈవో మామునూరు శ్రీధర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈవో మాట్లాడుతూ వంట కార్మికులలో ఉండే ప్రతిభను గుర్తించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన మెనూ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు మంచి రుచికరమైన పౌష్టికాహారం కలిగిన భోజనం అందించాలని కోరారు. కార్యక్రమంలో వర్ధన్నపేట కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కరుణ శ్రీ, వివిధ మండలాల విద్యాశాఖ అధికారులు, వంట కార్మికులు తదితరులు పాల్గొన్నారు.