- సినీ ప్రముఖుల ఇంటరాక్షన్ తో సందడిగా మారిన క్యాంపస్
- స్పెషల్ ఈవెంట్లతో అదరగొట్టిన స్టూడెంట్స్
హనుమకొండ, వెలుగు: వరంగల్ నిట్ లో స్ప్రింగ్ స్ప్రీ-–2026 వేడుకలు గ్రాండ్ గా ప్రారంభమయ్యాయి. ఫెస్ట్ లో మొదటి రోజు శుక్రవారం సినిమా మాస్టర్ క్లాసులు, సినీ ప్రముఖులతో ఇంటరాక్షన్ సెషన్స్, సృజనాత్మక పోటీలు, సంగీత కార్యక్రమాలతో వరంగల్ నిట్ క్యాంపస్ సందడిగా మారింది. డైరెక్టర్స్ కట్ లో భాగంగా హిట్ మూవీ ఫేం, డైరెక్టర్ శైలేశ్ కొలను చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. విద్యార్థులతో ఇంటరాక్టివ్ సెషన్ లో పాల్గొన్నారు. దర్శకత్వం, కథా రచన, ఫిల్మ్ టెక్నాలజీ, వినోదరంగంలో కెరీర్ అవకాశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. శుక్రవారం రాత్రి నిర్వహించిన స్పెషల్ ఈవెంట్ లో జోనితా గాంధీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఆ తరువాత నిట్ స్టేడియంలో ఫ్యాషన్ షో, డీజే ప్రోగ్రామ్ నిర్వహించారు. స్వయంభు సినిమా హీరో నిఖిల్, హీరోయిన్లు సంయుక్తా మీనన్, నభా నటేశ్ తో పాటు సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ తదితరులు విద్యార్థులతో ముచ్చటించారు. డిజిటల్ మీడియా, స్టార్టప్ రంగాలపై ఫ్లాష్ షూట్ సంస్థ సీఈవో కార్తీక్ వోలేటి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
అలరించిన ఈవెంట్లు..
స్ప్రింగ్ స్ప్రీ వేడుకల్లో భాగంగా విద్యార్థులు వివిధ ఈవెంట్లతో అలరించారు. ఫేస్ పెయింటింగ్, క్లే మోడలింగ్, లిటరరీ, డిబేటింగ్ క్లబ్ లో కవిత్వం, కథలు, స్పోకెన్ వర్డ్ ప్రదర్శనలు నిర్వహించారు. నుక్కడ్ నాటక్, డైరెక్టర్స్ స్కిట్, ట్రెజర్ హంట్, పర్యావరణ పరిరక్షణ, సంగీతానికి సంబంధించి కరాకే నైట్ నిర్వహించారు. స్ప్రింగ్ స్ప్రీ వేడుకలు శనివారం కూడా కొనసాగనున్నాయి. శనివారం సాయంత్రం ప్రముఖ సింగర్ రణీనా రెడ్డి స్పెషల్ ప్రోగ్రామ్ తో విద్యార్థుల్లో జోష్ నింపనున్నారు.
