కాశీబుగ్గ, వెలుగు: ఉత్తర తెలంగాణ ప్రజల వైద్య అవసరాల కోసం నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శుక్రవారం సిటీలోని వరంగల్ ఎంజీఎం ప్రాంతాల్లో నిర్మిస్తున్న మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్నిర్మాణాన్ని ఎంపీ కలెక్టర్ సత్య శారదాదేవితో కలిసి పరిశీలించారు. అనంతరం హాస్పిటల్ అభివృద్ధి పనులపై ఎంజీఎం సూపరింటెండెంట్, ఎల్అండ్టీ ఆఫీసర్లు, ఆర్అండ్బీ, విద్యుత్ శాఖ, జీడబ్ల్యూఎంసీ, ఫైర్ శాఖ ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న వరంగల్ మల్టీ స్పెషాల్టీ హాస్పిటల్‌ను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
తర్వలోనే ఓపీ, ఐపీ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, పారా మెడికల్ సిబ్బంది సేవలందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. అంతకుముందు వారు 24 అంతస్తుల భవనంలోని అన్ని ఫ్లోర్లను పరిశీలించారు. అంతకుముందు కలెక్టరేట్లో కలెక్టర్ సత్యశారద రోడ్డు సేఫ్టీ కమిటీతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే, నార్కోటిక్ కమిటీ మీటింగ్‌లో ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణితో కలిసి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
