నిత్యం చేసుకునే వంటల్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కొందరు కరివేపాకును ఇష్టంగా తింటారు. కానీ కొందరు మాత్రం కూరల్లో వేశాం కదా అని చెప్పి తినేటప్పుడు తీసేస్తారు. అయితే కరివేపాకు ఉపయోగాలు తెలిస్తే ఎవరూ కరివేపాకును పడేయరు. ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు కరివేపాకులో ఉన్నాయి.
కరివేపాకులో శరీరానికి ఎంతో ముఖ్యమైన క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, బి విటమిన్, కెరోటిన్, ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్థాలు, ఫైబర్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరానికి కరివేపాకు వల్ల చక్కని పోషణ లభిస్తుంది. ఈ ఆకును నిత్యం ఏ రూపంలో తీసుకున్నా సరే పోషకాలు అన్నీ అందుతాయి.
ఉదయాన్నే పరగడుపున పది కరివేప ఆకులను పచ్చివే నమిలి తినాలి. ఇలా చేయడం వల్ల మధుమేహం అదుపులోకి వస్తుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.
కరివేపాకులను ఎండబెట్టి పొడిచేసి ఆపొడిని అన్నంలో మొదటి ముద్దగా కలుపుకుని తింటే అజీర్తి తగ్గిపోతుంది. ఆకలి పెరుగుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. అయితే, కరివేపాకులకు మెంతులు, మిరియాలు కూడా కలిపి పొడి చేసి తీసుకుంటే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
మజ్జిగలో కొంత కరివేప ఆకుల రసం కలిపి తీసుకుంటే విరేచనాలు తగ్గుతాయి. కొబ్బరినూనెలో కొద్దిగా కరివేపాకు పేస్ట్ వేసి బాగా మరగబెట్టి అనంతరం వచ్చే ద్రవాన్ని వడబోసి వెంట్రులకు రాసుకుంటే జుట్టు సమస్యలు పోతాయి.
కరివేపాకు, గోరింటాకు, మర్రిపాలు సమభాగాలుగా తీసుకుని ముద్ద చేసి రాత్రిపూట వారం రోజులు రాసుకుంటే, కాళ్ల పగుళ్లు తగ్గుతాయి. ఒక స్పూన్ కరివేపాకు రసాన్ని ప్రతి రోజూ రెండు పూటలా తీసుకుంటూ ఉంటే మూత్రపిండాల సమస్యలు తగ్గిపోతాయి.
ఈ ఆకులు మెత్తగా సూరి, నెయ్యి లేదా వెన్నతో కలిపి కాలిన గాయాలపై రాస్తుంటే అవి త్వరగా మానడమే కాకుండా మచ్చలు కూడా పోతాయి.
