చెక్ డ్యాములను బాంబులతో పేల్చారు: అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

చెక్ డ్యాములను బాంబులతో పేల్చారు: అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో చేసిన బాంబ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోమవారం (డిసెంబర్ 29) ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఇటీవల మరణించిన సూర్యాపేట మాజీ ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డికి సభ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

ఆ తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లను బాంబులతో పేల్చినట్లు తన హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా చెక్ డ్యాములను కూడా బాంబులతో పేల్చివేశారని, ఈ అంశంపై విచారణ జరపాలని స్పీకర్‎ను కోరారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చారని అనడం ఏంటని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‎కు విజ్ఞప్తి చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ చెప్పారు. మొత్తానికి కౌశిక్ రెడ్డి బాంబ్ కామెంట్స్ తొలి రోజు సభలో కాకరేపాయి.