- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: కష్టపడి చదివితే భవిష్యత్ ఉజ్వలంగా మారుతుందని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకితో కలిసి పలు అంశాలపై చర్చించారు. అనంతరం తిరుమల హిల్స్ ఏరియాలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీని సందర్శించారు.
అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ మాట్లాడారు. టీచింగ్, భోజనం, వసతులు, ఇతర సౌలతులపై ఆరా తీశారు. ఎలాంటి సమస్యలు ఉన్నా చెప్పాలని విద్యార్థినులను కోరారు. చదువుకు జీవితాలను మార్చే శక్తి ఉందని, కష్ట పడి చదివి భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. కష్టపడి చదివి తల్లిదండ్రుల ఆశయం నిలబెట్టాలని పేర్కొన్నారు. విద్యార్థులు తమ సమస్యలను భయపడకుండా అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు.
మూసాపేట మండలం వేములలో అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని చైర్మన్ పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ భూమి, ఇందిరమ్మ ఇల్లు మంజూరు, ఔట్ సోర్సింగ్ జాబ్ ఇవ్వాలని ఆఫీసర్లకు సూచించారు. ప్రభుత్వం తరఫున రూ. 3 .47 లక్షల చెక్కును అందజేశారు. మిగతా రూ. 65 వేలు కలెక్టర్ తో మాట్లాడి త్వరగా అందజేయనున్నట్లు తెలిపారు.
ఆర్డీవో నవీన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డీటీడబ్ల్యూఓ కె.జనార్దన్, సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుదర్శన్, ఆర్సీఓ కళ్యాణి, డీపీఆర్ఓ శ్రీనివాస్, గురుకుల కాలేజీ ప్రిన్సిపాల్ వాసంతి పిళ్లై, తహసీల్దార్ ఘన్సీరాం, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీడీవో కృష్ణయ్య ఉన్నారు.
