ఫిజికల్‌ డిజబిలిటీ’ టోర్నీ విజేత కర్నాటక

ఫిజికల్‌ డిజబిలిటీ’ టోర్నీ విజేత కర్నాటక
  • ఫైనల్​లో హైదరాబాద్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపు

మల్కాజిగిరి, వెలుగు: ఈసీఐఎల్​లోని కొండల్ రావు  క్రీడా ప్రాంగణంలో రెండు రోజుల క్రితం  ప్రారంభమైన సౌత్‌ జోన్‌ ఫిజికల్‌ డిజబిలిటీ టీ20 టోర్నమెంట్‌-–2025 ఆదివారం ముగిసింది. ఫైనల్​లో కర్నాటక జట్టు విజేతగా నిలిచింది. హైదరాబాద్‌లోని ఎన్ఎఫ్‌సీఎల్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో చివరి రోజు జరిగిన ఫైనల్‌మ్యాచ్​లో హైదరాబాద్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ప్రశాంత్‌రామ్‌ 27 పరుగులతో రాణించాడు. కర్నాటక బౌలర్‌ అశోక యాదవ్‌ 4 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన కర్నాటక జట్టు 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 118  పరుగులు సాధించింది.  ఓపెనర్‌ భరత్‌ 35 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

అంతకుముందు ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు కేరళను ఓడించి మూడో స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా డీసీసీఐ(డిఫరెంట్లీ ఏబుల్డ్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ఆఫ్‌ ఇండియా) కార్యదర్శి రవికాంత్‌ చౌహాన్‌ మాట్లాడుతూ.. ఈ టోర్నమెంట్‌ ప్రతిభకు శారీరక పరిమితులు అడ్డుకావని నిరూపించిందని తెలిపారు. హైదరాబాద్‌, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ జట్లు పాల్గొన్నాయని చెప్పారు. విజేత జట్టుకు రూ.51 వేలు, రన్నరప్‌ కు రూ.21 వేలు, టోర్నీ బెస్ట్‌ ప్లేయర్‌ సాయి నాథ్‌రెడ్డి (హైదరాబాద్‌)కు రూ.11 వేలు, ప్రతీ మ్యాచ్‌ బెస్ట్‌ప్లేయర్‌- కు రూ.3,100 చొప్పున ప్రైజ్​మనీ అందించినట్లు తెలిపారు. టీసీఏడీ అధ్యక్షుడు ఎం.నరేంద్ర గౌడ్‌, కార్యదర్శి చంద్రబాస్‌ గిరి, డీసీసీఐ సౌత్‌ జోన్‌ చైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌, గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌అజయ్‌ కుందవరం, లీగ్‌ చైర్మన్‌ హిమబిందు రెడ్డి, స్పాన్సర్‌షిప్‌ డైరెక్టర్‌ సునీల్‌కుమార్‌, మీడియా డైరెక్టర్‌ రవిసింగ్‌చౌహాన్‌, స్ట్రాటజీ డైరెక్టర్‌పద్మాకర్‌ తదితరులు హాజరయ్యారు.