యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట.. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం

యాదగిరిగుట్టలో భక్తుల కిటకిట.. ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
  • ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం
  • ఆదివారం ఆలయానికి రూ.50.11 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. రద్దీ కారణంగా కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు సందడిగా దర్శనమిచ్చాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలిరావడంతో.. స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. 

స్వామివారి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, సువర్ణపుష్పార్చనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.50,11,920 ఆదాయం వచ్చింది. అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.20,01,980 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.7.95 లక్షలు, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8,19,500, బ్రేక్ దర్శనాలతో రూ.5,44,200 లక్షల అదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

యాదగిరిగుట్ట ఆలయానికి మూడు క్లీనింగ్ మెషిన్స్ అందజేత

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి రెండు కంపెనీలు మూడు క్లీనింగ్ మెషిన్స్ ను ఆదివారం అందజేశారు. హైదరాబాద్ కు చెందిన కృష్ణ జ్యువెల్లర్స్,  పూణేకు చెందిన ‘ఊట్ రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్’ కలిసి యాదగిరిగుట్ట ఆలయానికి రూ.5.95 లక్షల విలువ చేసే మూడు క్లీనింగ్ మెషిన్స్ ను విరాళంగా అందజేశారు. ఈ క్లీనింగ్ మెషిన్స్ తో ఆలయ అధికారులు ట్రయల్ రన్ చేశారు. రెండు క్లీనింగ్ మెషిన్స్ ను ప్రధానాలయ మాడవీధులు, మరో క్లీనింగ్ మెషిన్ ను అన్నప్రసాద విభాగం క్లీనింగ్ కు ఉపయోగించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.