- ఇయ్యాల లింగోద్భవుడికి అభిషేకాలు, శత రుద్రాభిషేకాలు
యాదగిరిగుట్ట, వెలుగు:యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్థినీ సమేత రామలింగేశ్వరస్వామి(శివాలయం) క్షేత్రంలో మహా శివరాత్రి ఉత్సవాలు శనివారం మూడో రోజు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం నిత్య హవనాలు, శివపంచాక్షరీ జపాలు, నందీశ్వర పారాయణాలు, పంచసూక్త పఠనాలు, మూలమంత్ర జపాలు జరిపారు. అనంతరం ఉదయం 10 గంటలకు రుద్రహవనం కైంకర్యాన్ని ఆలయ అర్చకులు శాస్త్రబద్దంగా నిర్వహించారు. అనంతరం రాత్రి శివపార్వతుల కల్యాణ మహోత్సవం కన్నులపండుగగా నిర్వహించారు.
రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కల్యాణ మహోత్సవం దాదాపుగా రెండు గంటల పాటు వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా తెప్పించిన పూలతో శివపార్వతులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆదిదంపతుల ఉత్సవమూర్తులను కల్యాణ మండపంలో అధిష్టింపజేసి కల్యాణ ఘట్టాన్ని ఆరంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, పారాయణికుల వేదపారాయణాలు, రుత్వికుల మూలమంత్ర, మూర్తిమంత్ర జపాల నడుమ, మంగళవాయిద్యాల కళతాళ ధ్వనుల మధ్య ముళ్లోకాది దేవతలు చూస్తుండగా కైలాసవాసుడు పార్వతీ అమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేసే తంతును అర్చకులు నయనానందకరంగా నిర్వహించారు.
నేడు మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం
శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు లింగోద్భవునికి అభిషేకాలు, బిల్వార్చనలు జరపనున్నారు. రాత్రి లింగోద్భవ కాలంలో లింగమూర్తికి మహాన్యాస పూర్వక శతరుద్రాభిషేకం నిర్వహించనున్నారు. అభిషేకం టికెట్ ధర రూ.300, లక్షబిల్వార్చన టికెట్ ధర రూ.516, శతరుద్రాభిషేకం టికెట్ ధర రూ.516 గా నిర్ణయించారు. ఒక టికెట్ పై దంపతులిద్దరికి మాత్రమే ప్రవేశం ఉంటుందని ఆలయ ఆఫీసర్లు తెలిపారు.
