బీఆర్‌‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారు : ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య

 బీఆర్‌‌ఎస్‌కు ప్రజలే బుద్ధి చెప్పారు : ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య
  • యాదగిరిగుట్ట, ఆలేరు కాంగ్రెస్‌కు కంచుకోట 
  • ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే  బీర్ల అయిలయ్య 

యాదగిరిగుట్ట, వెలుగు: మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందని అహంకారంగా మాట్లాడిన మహేందర్ రెడ్డి ఇప్పుడు ఏమంటారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య  ప్రశ్నించారు. యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో శనివారం యాదగిరిగుట్టలో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్ బీర్ల అయిలయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్‌‌ఎస్ రాష్ట్ర నాయకుడు  గొంగిడి మహేందర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

 2020 యాదగిరిగుట్ట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను ఏడు స్థానాల్లో గెలిపించినప్పటికీ ఎక్స్ అఫిషియో ఓట్లతో చైర్మన్ పదవి లాక్కోవడం వారి పతనానికి నాంది పలికిందన్నారు.  ప్రజా తీర్పును అవమానించిన బీఆర్ఎస్‌ను ప్రస్తుత ఎన్నికల్లో ఒక్క స్థానానికి పరిమితం చేసి ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. అహంకార రాజకీయాలు మానుకోకపోతే ప్రజలు రాజకీయంగా భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు.

ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోటగా కొనసాగుతోందని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా  ప్రజలు కాంగ్రెస్‌కే మద్దతు ఇస్తారని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనకు పుర ప్రజలు పట్టం కట్టారన్నారు.  ఎన్నికల ముందు చెప్పినట్లే ఆరు మున్సిపాలిటీలను ఏకపక్షంగా కాంగ్రెస్ కైవసం చేసుకుందన్నారు.  బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం ఫలించలేదని, యాదగిరిగుట్టలో అభ్యర్థులను నిలపక బీజేపీకి మద్దతు ఇచ్చినా ప్రయోజనం లేకపోయిందన్నారు.  రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ జయకేతనం ఎగరేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌‌ఎస్​ కుయుక్తులు  భగ్నం

ఆలేరు (యాదాద్రి), వెలుగు:  మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ కుయుక్తులను ఓటర్లు భగ్నం చేసి కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. ఆలేరులోని పార్టీ ఆఫీసులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్​ను ఓడించడానికి మాజీ ఎమ్మెల్యేలు బూడిద భిక్షమయ్య గౌడ్​,  గొంగిడి సునీత, బీఆర్​ఎస్​ లీడర్​ కల్లూరు రాంచంద్రారెడ్డి కుయుక్తులు పన్నారని ఆరోపించారు. బీజేపీతో ఇంటర్నల్​గా పొత్తు కుదుర్చుకున్నారని తెలిపారు.  కార్యక్రమంలో మహిళా కమిషన్​చైర్​పర్సన్​ బండ్రుశోభారాణి, మహిళా కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షురాలు నీలం పద్మ ఉన్నారు.