వరంగల్ హైవేపై ఇద్దరి మధ్య ఘర్షణ.. సిటీ బస్సు కింద పడి వ్యక్తికీ తీవ్ర గాయాలు..

వరంగల్ హైవేపై ఇద్దరి మధ్య ఘర్షణ.. సిటీ బస్సు కింద పడి వ్యక్తికీ తీవ్ర గాయాలు..

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నారపల్లి వరంగల్ హైవే దగ్గర సిటీ బస్సు కింద పడి ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం ( ఫిబ్రవరి 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ నుండి ఘట్కేసర్ వెళ్తున్న TGRTC AP 29Z 3193 నెంబర్ గల చెంగిచర్ల డిపో బస్సు నారపల్లి దగ్గరికి రాగానే ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు నారపల్లి దగ్గరికి చేరుకోగానే ఇద్దరు వ్యక్తులు ఘర్షణ పడుతూ వచ్చి ఒకతను బస్సు కింద పడటంతో అతని కాలు సగం వరకు తెగిపోయింది. 

ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తిని నాగోల్ కి చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు పోలీసులు. వృత్తి రీత్యా డీసీఎం డ్రైవర్ అయిన శ్రీనివాస్ నారపల్లికి కిరాయి వచ్చిన క్రమంలో దారికి అడ్డంగా ఉన్న డ్రైవర్ ను పక్కు వెళ్ళమని అడగడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో వాగ్వాదం తీవ్రమై ఒకరినొకరు నెట్టుకున్నారు. దీంతో శ్రీనివాస్ అటుగా వస్తున్న సిటీ బస్సు కింద పడిపోయారు.

బస్సు కిందపడటంతో శ్రీనివాస్ కాలు సగం వరకు తెగిపోయినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ ను సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.