హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో ‘పెండ్లి సందడి’ మొదలు కానుంది. మూడు నెలల విరామం తరువాత మంచి ముహూర్తాలు స్టార్ట్ కానున్నాయి. గత ఏడాది నవంబర్ 26న శుక్ర మూఢమి స్టార్ట్ కావటంతో ముహుర్తాలకు బ్రేక్ పడింది. ఈ నెల 18 నుంచి మూడు నెలల పాటు మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. గత మూడు నెలలుగా ముహూర్తాలు లేక వెలవెలబోయిన కల్యాణ మంటపాలు ఇకపై సందడిగా మారనున్నాయి.
ఈ నెల 18 నుంచి మే నెల వరకు వరుసగా శుభ ముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో వేలాది జంటలు ఒక్కటవనున్నాయి. ఇప్పటికే అన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ అయ్యాయి. కొన్ని మంచి ముహూర్తాల రోజు ఉదయం, సాయంత్రం పెండ్లిళ్లు, ఫంక్షన్లు జరగనున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి రెండో వారం నుంచే వాతావరణం మారనుంది. ప్రధానంగా ఈ నెల, మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అత్యధిక ముహూర్తాలు ఉన్నాయి.
వరుసగా 4 నెలల పాటు మంచి ముహుర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో వేల కోట్ల వ్యాపారం జరగనుంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి కలగనుంది. బట్టలు, బంగారం, ట్రావెల్స్, క్యాటరింగ్, ఈవెంట్ మేనేజ్ మెంట్, ఫొటోగ్రఫీ, పూలు, డెకరేషన్, ఫంక్షన్ హాల్స్, హోటల్స్ ఇలా భారీగా వ్యాపారం జరగనుంది. ఇప్పటికే అన్ని ఫంక్షన్ హాల్స్ బుక్ అయ్యాయి. షాపింగ్ కూడా 18 తరువాత స్టార్ట్ చేయనున్నారు. బంగారం ధరలు పెరిగిపోవడంతో.. గతంతో పోలిస్తే అమ్మకాలు కొంత తగ్గే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక పూలు, డెకరేషన్లు, ఈవెంట్ మేనేజర్లు బిజీ కానున్నారు.
మంచి ముహూర్తాలు ఎప్పుడంటే..
ఈ నెల 18 నుంచి నుంచి జూన్ వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉన్నట్టు పురోహితులు చెబుతున్నారు. ఈ నెల 18, 19, 20, 21, 22, 25, 26 మార్చి 4, 5, 6, 7, 8, 11, 12, 13, 14, 20, 21, 25, 29, ఏప్రిల్ 14, 16, 18, 19, 20, 21, 25, 29, 30.. మే 1, 5, 6, 8, 15, 17, 18. అదేవిధంగా జూన్ 1, 2, 4, 7 తేదీల్లో శుభముహూర్తాలు ఉన్నట్టు పంచాంగ నిపుణులు పేర్కొన్నారు.
జూన్ వరకు మంచి ముహూర్తాలే..
మూడు నెలల తరువాత ఈ నెల 18 నుంచి ముహుర్తాలు స్టార్ట్ కానున్నాయి. ఉగాది కంటే ముందు మనకు ఫాల్గుణ మాసంలో విశేష ముహుర్తాలు ఉన్నాయి. మార్చి 12 వరకు ముహుర్తాలు ఉన్నాయి. ఉగాది తరువాత మంచి రోజులు వస్తాయి. ఈ నెల , వచ్చే నెల మంచి ముహుర్తాలు ఉన్నాయి. ఈ రోజుల్లో భారీ ఎత్తున పెండ్లిళ్లు, గృహ ప్రవేశాలు జరగనున్నాయి.
మళ్లీ శ్రీరామనవమి తరువాత ముహుర్తాలు స్టార్ట్ కానున్నాయి. రాబోతున్నది అధిక జేష్ట మాసం, యమున, గోదావరి పుష్కరాలు వస్తున్నాయి. ఈ పుష్కరాలు జరిగే జిల్లాలు, నదులు ప్రవహించే ప్రాంతాల దగ్గర శుభకార్యాలు చేయకూడదు. అందుకే ఇప్పుడే పెండ్లిళ్లు చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. -
-పాలెపు చంద్రశేఖర్ శర్మ, పురోహితుడు, ధర్మపురి
మే వరకు బుకింగ్స్ పూర్తి
3నెలల నుంచి ముహుర్తాలు లేక రిసార్టులు, ఫంక్షన్ హాల్స్ ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 18 నుంచి పెండ్లిళ్లు స్టార్ట్ కానున్నాయి. మా రిసార్ట్ లో మే వరకు బుకింగ్స్ పూర్తయ్యాయి. మంచి ముహుర్తాలు ఉన్న రోజు ఉదయం, రాత్రి పెండ్లిళ్లు, ఫంక్షన్లు ఉన్నాయి. పెండ్లిళ్లు, రిసెస్షన్, ఎంగేజ్ మెంట్, సంగీత్ ఇలా అన్నింటికి బుక్ చేశారు. మంచి ముహుర్తాలు ఉన్న రోజు ఎక్కువ మంది అడుగుతున్నారు.
-రామ్‌రెడ్డి, రిసార్ట్ మేనేజర్
