ఇక నాలుగు కమిషనరేట్లు ! విలీనమైన జోన్ల ఆధారంగా హైదరాబాద్ పరిధి పెంపు

ఇక నాలుగు కమిషనరేట్లు ! విలీనమైన జోన్ల ఆధారంగా హైదరాబాద్ పరిధి పెంపు
  • కొత్తగా ఫోర్త్ సిటీ పోలీస్ కమిషనరేట్
  • శంషాబాద్, రాజేంద్రనగర్​హైదరాబాద్లోకి..
  • రాచకొండకు మూడు, సైబరాబాద్​కు మరో 3 జోన్ల కేటాయింపు 
  • ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న అధికారులు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలోకి శివారు మున్సిపాలిటీల విలీనం తర్వాత మూడు పోలీస్​కమిషనరేట్లలోని ప్రాంతాలను కూడా జోన్లకు అనుకూలంగా సర్దుబాటు చేయనున్నట్టు సమాచారం. ‘మహా’ బల్దియాలో 12 జోన్లను ఏర్పాటు చేయగా, వీటికి అనుగుణంగా మూడు పోలీస్​కమిషనరేట్లలోని ప్రాంతాలను అడ్జస్ట్​చేయబోతున్నట్టు తెలిసింది.

ఇందులో భాగంగా హైదరాబాద్ ​కమిషనరేట్లోకి ఆరు జోన్లు, రాచకొండకు మూడు, సైబరాబాద్ పరిధిలోను మూడు జోన్లు ఉంటాయని అంటున్నారు. వీటితో పాటు ఫోర్త్‌ సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు ముమ్మురం చేశారు. కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఈ నిర్ణయం వెలువడుతుందంటున్నారు.

ఎలా ఉండబోతోందంటే..
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ విలీన ప్రక్రియ తర్వాత 27 కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వచ్చి చేరడంతో పరిధి విస్తృతంగా పెరిగింది. హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో ఇప్పటివరకు చార్మినార్​, గోల్కొండ, ఖైరతాబాద్​, సికింద్రాబాద్​ప్రాంతాలు ఉండేవి. కానీ, ప్రస్తుతం సైబరాబాద్​పరిధిలోని శంషాబాద్​, రాజేంద్రనగర్​జోన్లను హైదరాబాద్​లో కలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యంగా, శంషాబాద్​ ఎయిర్​పోర్ట్​ ఏరియా ముఖ్యమైన ప్రాంతం కావడంతో హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అలాగే, సైబరాబాద్​పరిధిలో శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్​ప్రాంతాలు.. రాచకొండ పరిధిలో ఎల్బీనగర్​, మల్కాజిగిరి, ఉప్పల్​జోన్లను తీసుకురాబోతున్నట్ట  చర్చ జరుగుతోంది.  

ఫోర్త్ కమిషనరేట్​ ఇలా..
రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మహేశ్వరంలోని కొన్ని ప్రాంతాలు, షాద్​నగర్, చేవెళ్లలో కొన్ని ప్రాంతాలను కలిపి ఫోర్త్​సిటీ పోలీస్‌ కమిషనరేట్‌ ఏర్పాటు చేసేందుకు సర్కారు ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులోనే శంషాబాద్​ ప్రాంతాన్ని కలిపితే ఎలా ఉంటుందని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు డీజీపీ ఆఫీసులో పోలీస్ ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఉన్నతాధికారులు శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

మూడు కమిషనరేట్లలో రీ షఫ్లింగ్​, కొత్త కమిషనరేట్‌ పరిధి, సిబ్బంది సంఖ్య, జోన్లు తదితర అంశాలపై ఈ మీటింగ్​లో చర్చించారు. కొత్త ప్రతిపాదనలు అమలుకు సంబంధించిన జీవో మరో రెండు రోజుల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయంటున్నారు. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న యాదాద్రి భువనగిరి సైతం ఇకపై ప్రత్యేక పోలీస్‌ జిల్లాగా ఏర్పాటు చేయనున్నుట్టు తెలిసింది.