ఆసియాలో ఆకలి కేకలు

ఆసియాలో ఆకలి కేకలు
  • మన ఖండంలో 60 శాతం మందికి తిండి లేదు
  • ఇండియాలో పెరుగుతున్న ఊబకాయం

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 82 కోట్ల మంది ఆకలితో అలమటిస్తూ, పోషకాహార లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. గత ఏడాది ఇదే సమయానికి 81.1 కోట్ల మంది మాత్రమే తిండి దొరకని వాళ్లలో ఉన్నారని చెప్పింది. మూడేళ్లుగా ఆకలితో అలమటించే వాళ్ల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలానే కొనసాగితే ఒక్కరు కూడా ఆకలితో పడుకోకూడదనే లక్ష్యం నెరవేరడం అసాధ్యంగా మారుతుందని పేర్కొంది. 2018లో ఆసియా ఖండంలో 51.39 కోట్ల మంది తిండి లేక అల్లాడిపోయారని వెల్లడించింది.

మొత్తం ఆసియా జనాభాలో 11 శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని చెప్పింది. ఆకలితో అలమటిస్తున్న వాళ్లలో మూడొంతుల మంది ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోనే ఉన్నారని యూఎన్ వెల్లడించింది. ఇక్కడి ప్రతి పది మంది పిల్లల్లో 9 మంది అన్నీ కోల్పోతున్నారని తెలిపింది. ఆఫ్రికాలో ఆకలితో అలమటిస్తున్న వాళ్లు ఎక్కువగా ఉన్నారని చెప్పింది. తూర్పు ఆఫ్రికాలో పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొంది. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోకపోవడం పెరుగుదలపై ప్రభావం చూపుతోందంది. ప్రతి ఎనిమిది మంది పిల్లల్లో ఒకరు ఊబకాయంతో బాధపడుతున్నారని చెప్పింది. ఇండియాలో పోషకాహారలోపం  తగ్గుతున్నా, ఊబకాయ బాధితులు పెరుగుతున్నారని ఐక్యరాజ్యసమితి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏఓ) పేర్కొంది.

2012లో 2.41 కోట్ల మంది ఇండియన్స్ ఊబకాయంతో బాధపడుతుండగా, 2016లో ఈ సంఖ్య 3.28 కోట్ల పెరిగిందని వెల్లడించింది. 2004–06 మధ్య 25.39 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతుండగా, 2016–18లో 19.44 కోట్లకు తగ్గారని ‘ది స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ ఇన్ ది వరల్డ్ 2019’ రిపోర్టులో వివరించింది.