75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 14, 2021 అర్ధరాత్రి లోపు పెండింగ్‌లో ఉన్న లక్ష చిన్న కేసులను ఉపసంహరించుకోనుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వా శర్మ ప్రకటించారు. గౌహతిలో స్వాతంత్ర వేడుకల్లో జెండా ఎగరవేసిన అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పోస్టులపై నమోదైన క్రిమినల్ కేసులు సహా చిన్న చిన్న నేరాలకు సంబంధించిన లక్ష కేసులను ఉపసంహరించుకోనున్నట్లుగా ఆయన తెలిపారు.
దీనివల్ల దిగువ న్యాయవ్యవస్థపై భారం తగ్గుతుందని శర్మ అన్నారు. ఫలితంగా అత్యాచారం, హత్య వంటి తీవ్రమైన నేరాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టడంలో న్యాయవ్యవస్థకు సహాయపడుతుందని అన్నారు. అస్సాంలో మొత్తం 4,00,000 పెండింగ్ కేసులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. న్యాయవాదులు అందుబాటులో లేకపోవడంతో ఎవరైనా అమాయకులు జైలులో మగ్గుతుంటే అలాంటి వ్యక్తులను సత్వరమే విడుదల చేస్తామని తెలిపారు.
ఇక దేశంలో చేపట్టిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ప్రతి వ్యక్తి హృదయంలో అంతర్లీనంగా ఉన్న దేశభక్తిని వెలుగులోకి తెచ్చిందని తెలిపారు . రాష్ట్రంలో 17 కోట్లతో 42 లక్షల జెండాలను అందించినట్లుగా శర్మ వెల్లడించారు.

