V6 News

గోల్కొండ టైగర్ ఇకలేరు : బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

గోల్కొండ టైగర్ ఇకలేరు : బద్దం బాల్ రెడ్డి కన్నుమూత

బీజేపీ సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బాల్ రెడ్డి.. బంజారాహిల్స్ లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. చిన్నప్రేగుకు క్యాన్సర్  సోకడంతో బద్దం బాల్ రెడ్డి ఈనెల 10న ఆస్పత్రిలో చేరారు. ఈనెల 13న శస్త్ర చికిత్స జరిగింది. అప్పటి నుంచి బాల్ రెడ్డికి వెంటిలేటర్ పైనే ఉన్నారు. చికిత్స సహకరించకపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. సాయంత్రం 6 గంటల 43 నిమిషాలకు బాల్ రెడ్డి చనిపోయారని వైదులు తెలిపారు.

రాష్ట్ర బీజేపీలో సీనియర్ నేతగా ఉన్న బద్దం బాల్ రెడ్డి.. హైదరాబాద్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఓల్డ్ సిటీలో గోల్కొండ టైగర్ గా బాల్ రెడ్డిని పిలిచేవారు. కార్వాన్ నుంచి 1985,89,94లో  వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బద్దం బాల్ రెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో బద్దం బాల్ రెడ్డిపై దాడికి  ఐఎస్ఐ ఉగ్రవాదులు ప్రయత్నించారు.

బద్దం బాల్ రెడ్డి మృతితో బీజేపీలో విషాదం అలుముకుంది. రాష్ట్ర బీజేపీ నేతలు కేర్ ఆస్పత్రికి చేరుకుని బాల్ రెడ్డికి నివాళి అర్పించారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ ఆస్పత్రికి వచ్చి బాల్ రెడ్డి భౌతికకాయాన్ని సందర్శించారు. బీజేపీ కార్యకర్తలు భారీగా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రేపు సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బద్దం బాల్ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.