పోతిరెడ్డిపాడును అడ్డుకోకుంటే తిరుగుబాటే

పోతిరెడ్డిపాడును అడ్డుకోకుంటే తిరుగుబాటే
  • కేసీఆర్, జగన్ కలిసి ఇరు రాష్ట్రాలను దోచుకుంటున్నరు
  • ఉద్యమం ఉధృతం చేస్తాం
  • వెంటనే అఖిలపక్ష మీటింగ్ పెట్టాలని డిమాండ్
  • పార్టీ ఆఫీస్ లో దీక్ష చేసిన రాష్ట్ర బీజేపీ చీఫ్
  • జిల్లాల్లో దీక్షలు చేసిన బీజేపీ కేడర్

హైదరాబాద్, వెలుగురాష్ట్రానికి తీవ్ర నష్టం కలిగించేలా ఏపీ పోతిరెడ్డిపాడు విస్తరణ చేపడుతున్నా సీఎం కేసీఆర్​ ఇంతకాలం ఎందుకు మౌనంగా ఉన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్​ నిలదీశారు. ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని బయటపెట్టడంతోనే.. ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్​ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి ఇరు రాష్ట్రాలను దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్, జగన్ అన్నదమ్ములని ఏపీ మంత్రి అనిల్ అన్నారని.. మరి ఆ ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందాలు ఏమిటని ప్రశ్నించారు. ఏపీ ప్రాజెక్టును అడ్డుకోకుంటే ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్​ సర్కారు ఇప్పటికైనా తగిన చర్యలు చేపట్టాలని.. లేకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో రాష్ట్ర సర్కారు తీరును తప్పుపడుతూ బండి సంజయ్​ బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్ష చేశారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు దీక్షలో కూర్చున్నారు. ఆయనకు సంఘీభావంగా రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ సీనియర్​ నేతలు, కార్యకర్తలు కూడా ఇండ్లల్లో దీక్షలు చేశారు.

ప్రజల్ని మోసం చేస్తున్నారు

రాష్ట్రం విషయంలో కేసీఆర్ ద్వంద్వ విధానాలను అవలంబిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో ఒకలా వ్యవహారించిన కేసీఆర్, అధికారంలోకి వచ్చాక మరో రీతిలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్తూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కృష్ణా ప్రాజెక్టులపై టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తమ పార్టీ పోరాటం మొదలైందని, కేసీఆర్ స్పందించకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పారు. కృష్ణా నదిలో తెలంగాణకు 299 టీఎంసీల వాటా ఉన్నా..  వాడుకోవడంలో  సర్కారు పూర్తిగా విఫలమైందన్నారు. ఉద్యమ సమయంలో ఇచ్చిన నినాదాన్ని కేసీఆర్ ఇప్పుడు  విస్మరించారని మండిపడ్డారు. అసలు పోతిరెడ్డిపాడుకు అనుమతి ఉన్నదే 11 వేల క్యూసెక్కులు అని.. అయినా ఉమ్మడి రాష్ట్రంలో కెపాసిటీని 44 వేల క్యూసెక్కులకు పెంచారని సంజయ్​ గుర్తు చేశారు. ఇప్పుడు ఏపీ ఏకంగా 80 వేల క్యూసెక్కులు తరలించుకునేలా కెపాసిటీ పెంచేపనిలో ఉందని, దాన్ని అడ్డుకోవాలని పేర్కొన్నారు. దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు.  నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు సుధాకర్‌రావుపై పోలీసులు వ్యవహరించిన తీరును సంజయ్ తప్పుపట్టారు. రైతులకు అండగా ఉన్న నేతను కొట్టడం దుర్మార్గమని, దానికి కారకులను వెంటనే సస్పెండ్​ చేయాలని డిమాండ్​
చేశారు.

హడావుడి లేకుండా సాదా సీదాగా దీక్ష

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు సెంటర్లలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఇటీవలే దీక్ష చేసిన సంజయ్.. పోతిరెడ్డిపాడు వ్యవహారంపై బుధవారం దీక్ష చేశారు. లాక్​డౌన్, ఇతర నిబంధనలను అనుసరిస్తూ సంజయ్ ఒక్కరే దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం బీజేపీ స్టేట్ ఆఫీస్ కార్యదర్శి ఉమాశంకర్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఇక సంజయ్ దీక్షకు సంఘీభావంగా బీజేపీ సీనియర్లు ఎమ్మెల్సీ రాంచందర్ రావు, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతా సాంబమూర్తి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, జనార్థన్ రెడ్డి, దుబ్బాసి వాసుదేవ్  తదితరులు తమ ఇండ్లలో నిరసన దీక్ష చేశారు.

సంజయ్‌పై కేసు సరికాదు: రాంచందర్​రావు

బీజేపీ రాష్ట్ర చీఫ్​ బండి సంజయ్ మంగళవారం నల్గొండ జిల్లాలో బత్తాయి రైతులను పరామర్శించిన సందర్భంలో జనం ఎక్కువగా ఉన్నారని, లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు పెట్టడం సరికాదని బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. లాక్ డౌన్ రూల్స్​ పేరుతో బీజేపీ నేతలు, కార్యకర్తలను టీఆర్ఎస్ సర్కార్ వేధింపులకు గురి చేస్తోందని ఓ ప్రకటనలో ఆరోపించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ప్రాంతాల్లో, మార్కెట్ ఏరియాల్లో తిరుగుతున్నారని, వారి విషయంలో లేని రూల్స్​ ప్రతిపక్షాలకే వర్తిస్తాయా అని నిలదీశారు.

ఏపీ తీరు రాష్ట్ర హక్కులకు భంగం

బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ
పొంగులేటి సుధాకర్ రెడ్డి

పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచుతూ ఏపీ తీసుకున్న నిర్ణయం రాష్ట్ర హక్కులకు భంగకరమని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. సంజయ్  పిలుపుమేరకు హైదరాబాద్ లోని తన నివాసంలో పొంగులేటి నిరసన దీక్ష చేశారు. ఏపీ తీరుతో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.  ఏపీ కంటే తెలంగాణలోనే కృష్ణా పరీవాహక ప్రాంతం ఎక్కువగా ఉందని, ఎక్కువ నీళ్లు రాష్ట్రానికే రావాలని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని.. వేల మంది త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేశారు. రాష్ట్ర హక్కులను కాపాడటానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు.

చిన్న పరిశ్రమలకు అప్పు కోసం రూ.3లక్షల కోట్లు