పంజాబ్ పై బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ.. ప్లేఆఫ్ కు దూసుకెళ్లిన కోహ్లీ సేన

పంజాబ్ పై బెంగళూరు థ్రిల్లింగ్ విక్టరీ.. ప్లేఆఫ్ కు దూసుకెళ్లిన కోహ్లీ సేన
  • బెంగళూరు స్కోర్: 20 ఓవర్లలో 164/8, పంజాబ్ 158/6 

షార్జా: చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ పై విజయం సాధించింది. ఆరు పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన కోహ్లి సేన ఈ విజయం ద్వారా ప్లేఆఫ్ బెర్తును ఖరారు చేసుకుంది. ఐపీఎల్ 2021లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ లో బెర్తులు ఖరారు చేసుకోగా తాజాగా కోహ్లీ సేన కూడా ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. 
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటింగ్ లో ఓపెనర్లు దేవ్ దత్ పడిక్కల్ (40), విరాట్ కోహ్లి (20) శుభారంభం చేయగా.. గ్లెన్ మ్యాక్స్ వెల్ (57), డివిలియర్స్ (23) పరుగులు తర్వాత మిగతా వారెవరూ పెద్దగా నిలదొక్కుకోకపోవడంతో కోహ్లి సేన 164 పరుగులే చేయగలింగింది. పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమి, హెన్రిక్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. 
బెంగళూరు విధించిన 164 పరుగుల టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్ జట్టు చివరి వరకు పోరాడి 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్ కింగ్స్ జట్టులో ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (57), కేఎల్ రాహుల్ (39) తొలి వికెట్ కు 10.5 ఓవర్లలోనే 91 పరుగులు జోడించి శుభారంభం చేశారు. ఆ తర్వాత మిడిలార్డర్ తడబడడంతో పంజాబ్ జట్టు వెంటవెంటనే వికెట్లు కోల్పోయి మ్యాచ్ పై ఆధిక్యం సాధించలేకపోయింది. చివర్లో షారుక్ ఖాన్ (16( ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా.. చివరి ఓవర్లో రనౌట్ కావడం మ్యాచ్ మలుపు తిరిగి కోహ్లిసేన విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో చహల్ 3, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్ చెరో వికెట్ పడగొట్టారు.