ఊళ్లన్ని పూల వనాలుగా..

ఊళ్లన్ని పూల వనాలుగా..
  • ఊళ్లన్నీ పూల వనాలుగా మార్చే ఆడపడుచుల వేడుక
  • గౌరమ్మకు తొమ్మిది రోజులు నిండుగా పూజలు
  • నేటి అమాసతో ఎంగిలి పూల బతుకమ్మ కొలువు
  • అష్టమి నాడు సద్దుల బతుకమ్మకు వీడుకోలు

తెలంగాణ ప్రజల బతుకులతో ముడిపడిన పండుగ.. బతుకమ్మ. పసుపుతో గౌరమ్మను చేసి, పూలతో అలంకరించి ఆడపచులంతా ఒక్క చోట చేరి ఆటపాటలతో జరిపే వేడుక. అన్నదమ్ములు చేదోడుగా..  చెట్లంటా.. చేలంటా తిరిగి అక్క చెల్లెళ్లకు పూలు తెచ్చిపెట్టి.. సంబరంలో భాగమైతరు. ఊరంతా పూల వనమల్లే తొమ్మిది రోజులు సంబురంగా గౌరమ్మను పూజించి.. గంగమ్మ సాక్షిగా సంగనంపుతరు. ప్రకృతిని ఇంతగా ఆరాధించే పండుగ మన రాష్ట్రంలోనే కనిపిస్తుంది.

పెత్రమాసనాడు  ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో మొదలయ్యే వేడుకలు… అష్టమి రోజు వైభవంగా జరిగే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఒక్కోరోజు తయారు చేసే నైవేద్యాన్ని బట్టి.. బతుకమ్మను ఒక్కొక్క పేరుతో పిలుస్తారు.

తీరొక్క పూలతో

ఇవాళ మహా అమావాస్య సందర్భంగా బతుకమ్మ మొదటిరోజు వేడుక మొదలవుతుంది. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను కొలుస్తారు మహిళలు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేసి తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మకు సమర్పిస్తారు.

తొలి రెండు నాళ్లు బోడెమ్మగా..

రెండో రోజు అటుకుల బతుకమ్మ కోసం  పప్పు, బెల్లం, అటుకులతో ప్రసాదం తయారు చేస్తారు. మూడో రోజున ముద్దపప్పు బతుకమ్మ. మొదటి రెండు రోజులు బతుకమ్మను బొడ్డెమ్మగా కొలిచే మహిళలు.. మూడోరోజు లక్ష్మీదేవిగా ఆరాధిస్తారు. ఈ రోజున ముద్దపప్పు, బెల్లం, పాలతో ప్రసాదం తయారు చేస్తారు. నాలుగో రోజు జరుపుకునేది  నానబియ్యం బతుకమ్మ.పాలు, బియ్యం నానేసిన బియ్యంతో ప్రసాదం తయారు చేస్తారు. బతుకమ్మను  గౌరమ్మగా ఆరాధిస్తారు మహిళలు. అయిదో రోజు జరుపుకునే వేడుకను అట్ల బతుకమ్మగా పిలుస్తారు. ఈ రోజున దోసెలు ప్రసాదంగా వేస్తారు.

ఆరో నాట బతుకమ్మ అలక..

ఆరో రోజు అలిగిన బతుకమ్మ… ఈ రోజు  బతుకమ్మను పేర్చరు. ఆట,పాట ఉండదు.  ఏడో రోజున  వేపకాయి బతుకమ్మ. దీన్ని సకినాల బతుకమ్మగా కూడా పిలుస్తారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయ ఆకారంలో ముద్దలు చేసి నూనెలలో వేయించి ప్రసాదం తయారు చేస్తారు. ఎనమిదో నిర్వహించే వేడుక వెన్నముద్దల బతుకమ్మ. ఈరోజున బతుకమ్మను దుర్గమ్మగా కొలుస్తారు. నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం పలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సకల సౌభాగ్యాలూ అనుగ్రహించ మళ్లీ రావమ్మా అంటూ..

సంబురాల్లో చివరి రోజున సద్దుల బతుకమ్మ. ఈ రోజు తెలంగాణ అంతా పూల వనంలా మారుతుంది. బతుకమ్మను సాగనంపే రోజు కావడంతో చివరి రోజును ఘనంగా జరుపుకుంటారు. మహిళలంతా బతుకమ్మలు పేర్చి గౌరిదేవిగా పూజిస్తారు. సాయంత్రం బతుకమ్మలాడి,.. ఊరిచెరువులో నిమజ్జనం చేస్తారు. సకల సౌభాగ్యాలూ అనుగ్రహించడానికి మళ్లీ రమ్మని వేడుకుంటూ వీడ్కోలు పలుకుతారు.

 

V6 బతుకమ్మ పాట 

వీడియో కోసం క్లిక్ చేయండి